అలియా, రణ్‌బీర్‌ వెడ్డింగ్‌ కార్డు.. వైరల్‌

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, హీరోయిన్‌ అలియా భట్‌ జనవరి 22న పెళ్లి చేసుకోబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వెడ్డింగ్‌ కార్డు చక్కర్లు కొడుతోంది. గత కొద్ది కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి అవ్వనున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. ముంబై విమానాశ్రయంలో ఫ్లైట్‌ కోసం వేచి చూస్తున్న అలియాను.. వివాహం, వెడ్డింగ్‌ కార్డుపై వస్తున్న వార్తలను గురించి అడగ్గా ‘ఆమె సిగ్గుపడుతూ.. నేను ఏమి చెప్పాలి? పెళ్లిపై వస్తున్న పుకార్లలో నిజం లేదంటూ తల అడ్డంగా ఊపింది.’ దీంతో వీరి వివాహం జనవరి 22న జోధ్‌పూర్‌లోని ఉమేద్‌ భవన్‌ ప్యాలెస్‌లో జరగనుందని వస్తున్న వార్తలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టమైంది.

వివాహ ఆహ్వాన పత్రికను కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అందులో ఉన్న తప్పులు కొట్టొచిన్నట్లు కనిపిస్తున్నాయి. అలియా భట్‌ తండ్రి పేరు వాస్తవానికి మహేష్‌ భట్‌ అయితే, ఆహ్వాన పత్రికలో మాత్రం ముఖేష్‌ భట్‌ అని తప్పుగా ఉంది. అంతేకాక అలియా భట్‌ పేరుతో పాటు తేదిలో కూడా అక్షర దోషాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వివాహానికి సంబంధించి వస్తున్న వార్తలను అలియా చిరునవ్వుతో కొట్టి పారేయడంతో.. వైరల్‌ అవుతున్న వెడ్డింగ్‌ కార్డ్‌ ఫేక్‌ అని తేలింది.