చిరుతో అంత వీజీ కాదు.. హరీష్!

సాయి ధరం తేజ్ తో సినిమా చేసినప్పుడే హరీష్ దృష్టి మెగాస్టార్ పై పడింది. అయితే ఆయన అప్పటికి రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన హరీష్ కు కనీసం తన కోరిక చెప్పే అవకాశం కూడా రాలేదు. అయితే ఇప్పుడు హరీష్ తనకు లైన్ క్లియర్ అవుతుందని నమ్ముతున్నాడు. డిజె తో హిట్ కొట్టిన తనపై చిరు ఖచ్చితంగా ఫోకస్ చేస్తాడనేది హరీష్ భావన్. అందుకే డిజె సినిమా ప్రమోషన్స్ లో కూడా హరీష్, చిరు ప్రస్తావన తీసుకొచ్చి మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేశానని, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అన్నారు. డిజె సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించడంతో ఇక మెగాస్టార్ తో హరీష్ సినిమా ఖాయమనుకున్నారంతా.
కానీ అది అనుకున్నంత తేలికైన విషయమైతే కాదు. ప్రస్తుతం చిరు తన 151వ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. దీని తరువాత బోయపాటి సినిమా కూడా లైన్ ఉంది. అంటే హరీష్ కనీసం రెండేళ్ల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. అప్పుడు చిరు దృష్టి మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరో విషయమేమిటంటే.. చిరు ఇప్పుడు పూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమాలు కాకుండా ‘కత్తి’ లాంటి సామాజిక చైతన్య ఉన్న కథలను ఎన్నుకుంటున్నాడు. ఉయ్యాలవాడ కూడా ఓ చరిత్ర. ఈ క్రమంలో హరీష్ నుండి అలాంటి ఓ కథను ఆశించడం అత్యాసే అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ సినిమా అంటే ఛాన్సులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.