ఆ సినిమాలో కీలక పాత్ర చేయనున్న హెబ్బాపటేల్‌

యంగ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న మూవీ ‘భీష్మ’. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. గత ఏడాది ఈ సినిమా షూటింగ్‌ ఆరంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో నటి హెబ్బాపటేల్‌ కూడా సందడి చేయనున్నట్లు తెలిసింది. ఆమె ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ నటనకు ఆస్కారం ఉండటంతో ఆమె సంతకం చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమా కోసం హెబ్బా బరువు కూడా తగ్గారట. ఇప్పటికీ ఆమె షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ‘అలా ఇలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హెబ్బా తర్వాత ‘కుమారి 21 ఎఫ్‌’ చిత్రంతో బ్రేక్‌ అందుకున్నారు. ‘ఈడోరకం ఆడోరకం’, ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా మెరిశారు. గత ఏడాది విడుదలైన ’24 కిస్సెస్‌’ లో చివరిసారి వెండితెరపై కనిపించారు.