ఏపీ సీఎం వైఎస్ జగన్‌ గురించి కృష్ణంరాజు ఏమన్నారు?


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వ మంత్రివర్గం ఏర్పాటుపై స్పందించారు. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కృష్ణంరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లో రియల్ హీరో అంటూ జగన్‌ను ప్రశంసించారు. మంత్రివర్గ విస్తరణలో జగన్ నిర్ణయం ‘సామాజిక విప్లవానికి నాంది’గా భావిస్తున్నానని తెలిపారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మంత్రి మండలి ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీ, బలహీన, మైనారిటీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించటం అభినందనీయం అని పేర్కొన్నారు.

ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు కేటాయించడం జగన్ ఉన్నత నాయకత్వ లక్షణాలకు నిదర్శనమని అన్నారు. ఎవరూ ఊహించని విధంగా ఎనిమిది మంది బీసీలకు, ఐదుగురు ఎస్సీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం భవిష్యత్తు రాజకీయాలకు మార్గదర్శకంగా భావిస్తున్నానని అన్నారు. పరిణతి చెందిన ప్రజా నాయకుడిగా స్పీకర్ పదవి బీసీలకు, డిప్యూటీ స్పీకర్ పదవి బ్రాహ్మణులకు కేటాయించడం చాలా మంచి నిర్ణయంమని కృష్ణంరాజు తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల అఖండ అభిమానం చూరగొన్న నాయకుడిగా, పిన్న వయసులోనే ప్రజానేతగా ఎదిగిన జగన్ ‘రాజకీయాల్లో రియల్ హీరో’ అన్నారు. మీ మంత్రిమండలి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనే ధ్యేయంగా ముందడుగు వేస్తారని నాకు గట్టి నమ్మకం ఉందని అన్నారు.