HomeTelugu Newsఈరోజు పీఆర్పీ ఉండేది: పవన్‌ కళ్యాణ్‌

ఈరోజు పీఆర్పీ ఉండేది: పవన్‌ కళ్యాణ్‌

11 1జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓటమి కష్టమే అయినా ధైర్యంగా ఎదుర్కొంటే విజయం వరిస్తుందని అన్నారు. తాను అపజయానికి కుంగిపోయి.. విజయానికి పొంగిపోయే వ్యక్తిని కాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పవన్‌ మాట్లాడారు. ఎలాంటి సమస్యనైనా చాలా బలంగా ఎదుర్కోగలనని, తనపై తనకు ఆ నమ్మకం ఉందన్నారు. ప్రజలు ఓట్లెయ్యకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి తన పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. ‘భీమవరంలో నా ఓటమి గురించి చాలా మంది కుంగిపోయారు. నేను 10 నిమిషాల్లో తేరుకుని తర్వాతేంటి? అని ఆలోచించా. ఓటమిని తలచుకుని ఎంతకాలం బాధపడతాం?’ అని పవన్‌ వ్యాఖ్యానించారు. తన ఆఖరి శ్వాస వరకూ పార్టీని నడుపుతానని ఆయన స్పష్టం చేశారు.

తన సోదరుడు చిరంజీవి మెతకతనం, ఒత్తిడితోనే ఆయన ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)ని నడపలేకపోయారని పవన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటిలా ఆ సమయంలో నేతలందర్నీ కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే ఈరోజు పీఆర్పీ ఉండేదన్నారు. జనసేనకు ప్రస్తుతం అసెంబ్లీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారని.. భవిష్యత్తులో ఏపీ అసెంబ్లీ మొత్తం స్థానాలను ఆక్రమించే స్థాయికి జనసేన చేరుకుంటుందని పవన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు తప్పకుండా ఆరోజు వస్తుందన్నారు. నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో జనసేన పార్టీ బలంగా ఉందని చెప్పారు. ప్రతి ఓటూ కీలకమైనదని.. జనసైనికులంతా పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పవన్‌ పిలుపునిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu