డమ్మీ గుర్రంపై కంగనా రనౌత్ సవారీ.. వైరల్‌

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటుంది. ఆమె టైటిల్‌ రోల్‌లో నటించిన సినిమా ‘మణికర్ణిక’. ఈ సినిమాలో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయిగా నటించారు. ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీ, కత్తిసాము తదితర విద్యలు నేర్చుకున్నట్లు ఓ సందర్భంలో కంగన చెప్పారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియో బయటికి వచ్చింది. ఇందులో కంగన పరికరాలు అమర్చిన డమ్మీ గుర్రంపై సవారీ చేస్తుంటే.. ఆమె సైనికులు (సినిమాలో) నిజమైన గుర్రంపై సవారీ చేస్తూ కనిపించారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. చిన్న పాత్రలు పోషించిన ఆర్టిస్టులు కష్టపడి గుర్రం సవారీ చేస్తుంటే.. కంగన మాత్రం ఇలా చేయడాన్ని విమర్శించారు. ఆమె మోడ్రన్ రాణి అని ఎద్దేవా చేశారు. అయితే ఈ వీడియో గురించి కంగన స్పందించలేదు.

‘మణికర్ణిక’ చిత్రానికి క్రిష్‌, కంగన సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ‌కమల్‌ జైన్‌ సినిమాను నిర్మించారు. జనవరి 25న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. చిత్రం బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.150 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోపక్క ఈ సినిమా పలు వివాదాలు ఎదుర్కొంది. సినిమా దర్శకత్వ క్రెడిట్‌ను కంగన తీసుకోవడంపై క్రిష్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ దీన్ని కంగన ఖండించారు. ‘పూర్తి సినిమాకు నేనే దర్శకత్వం వహించాను’ అని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తన ప్రతిభ ఏంటో తన సినిమాలు చూస్తే తెలుస్తుందని, క్రెడిట్‌ కోసం ఇప్పుడు మాట్లాడటం లేదని, కంగన తీరు ఇకనైనా మారాలని క్రిష్‌ చెప్పారు.

https://twitter.com/twinitisha/status/1098499601496064000