కార్తికేయ పెళ్లి ఎంత అందంగా జరిగిందో.. వీడియో షేర్‌ చేసిన సుస్మితా


ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజల వివాహం డిసెంబరు 30న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌లోని ఓ ఐదు నక్షత్రల హోటల్‌లో ఈ శుభకార్యం జరిగింది. టాలీవుడ్‌ సినీ ప్రముఖులు పెళ్లికి హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ కూడా తన కుమార్తెలతో (దత్తత తీసుకున్న వారు) కలిసి వివాహానికి హాజరయ్యారు. అందరితో కలిసి ఆనందంగా సమయాన్ని గడిపారు.

 

కాగా కార్తికేయ, పూజ పెళ్లి పీటలపై తలంబ్రాలు పోసుకుంటున్న వీడియోను సుస్మిత తాజాగా సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. పెళ్లి చాలా అందంగా జరిగిందన్నారు. ‘తలంబ్రాల్లోని ఒక్కో ధాన్యం మీకు దీవెనలు, ప్రేమ, ఆనందం, ఆ దేవుడి ఆశీర్వాదాలు, సిరిసంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నా. పూజ, కార్తికేయలకు శుభాకాంక్షలు. పెళ్లి ఎంత అందంగా జరిగిందో.. ఐ లవ్‌ యు గాయ్స్‌’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

రానా కూడా కార్తికేయ, పూజకి తాజాగా శుభాకాంక్షలు చెప్పారు. ‘2018లో నాకు ఇష్టమైన ఫొటో ఇది’ అంటూ కార్తికేయ, పూజ జీలకర్ర, బెల్లం పెట్టుకుంటున్న ఫొటోను రానా షేర్‌ చేశారు. దీన్ని ఉపాసన కొణిదెల తీశారని కూడా చెప్పారు.