‘కవచం’ టీజర్‌


యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘కవచం’. ఈ సినిమాలో కాజల్‌, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నవీన్‌ సొంటినేని ఈ మూవీని నిర్మిస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌లో బెల్లంకొండ పోలీసు అధికారిగా కనిపించి ఆకట్టుకున్నారు. సోమవారం సాయంత్రం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. విభిన్న కథాంశంతో దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

‘అనగనగా ఓ రాజ్యం.. ఆ రాజ్యానికి రాజు లేడు. రాణి మాత్రమే.. ఆ రాణికి కవచంలా ఓ సైనికుడు’ అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘భయపెట్టేవాడికీ.. భయపడేవాడికీ మధ్య ఒకడు ఉంటాడు రా.. వాడే పోలీస్‌’ అంటూ బెల్లంకొండ చెప్పే డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉంది. ‘ఎక్కడో లింక్‌ మిస్‌ అవుతోంది. మనకు తెలియని కథ.. ఇంకేదో జరుగుతోంది’ అనే డైలాగ్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు. ‘పోలీసోడితో ఆడాలంటే బులెట్‌ కంటే బ్రెయిన్‌ ఫాస్ట్‌గా ఉండాలి’ అని బెల్లంకొండ రౌడీని హెచ్చరించే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాను డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.