శృతిహాసన్ పై ఖుష్బూ సెటైర్లు!

‘బాహుబలి’ సినిమాకు ధీటుగా 250 కోట్ల బడ్జెట్ తో దర్శకుడు సుందర్ సి ‘సంఘమిత్ర’ సినిమా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గా అట్టహాసంగా జరిగింది. జయం రవి, ఆర్య హీరోలుగా ఎంపికయ్యారు. అలానే నటి శృతిహాసన్ కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిని వ్యక్తం చేసింది. సినిమా కోసం కత్తియుద్ధాలు కూడా నేర్చుకుంది. కానీ సడెన్ గా ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దానికి కారణాలు ఏంటని..? ఆరా తీయగా.. స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం కాలేదని, డేట్స్ విషయంలో కూడా స్పష్టత లేదని వెల్లడించింది శృతి. అయితే ఈ విషయంపై సుందర్ సి భార్య నటి ఖుష్బూ చాలా ఆలస్యంగా స్పందించారు. శృతిహాసన్ పేరుని ప్రస్తావించకుండా పరోక్షంగా ఆమెపై సెటైర్లు వేశారు. 

సంఘమిత్ర స్క్రిప్ట్ పూర్తికాలేదని వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ‘సంఘమిత్ర’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు ముందుగా ఉండాల్సింది ప్లానింగ్. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తికాలేదని కొందరు చేస్తోన్న కామెంట్లు చూశాను. ఈ సినిమా రెండేళ్లుగా పని చేస్తున్నారు. మన లోపాలు కప్పిపుచ్చుకోవడానికి పక్క వాళ్ళ మీద నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్. అందులోనూ ఒకరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ నుండి వృత్తి పరంగా మరింత హుందాతనాన్ని కోరుకుంటాం. తప్పుల్ని అంగీకరించగలిగితే ఉన్నత స్థాయికి ఎదుగుతారు అంటూ ఖుష్బూ పరోక్షంగా శృతిహాసన్ ను దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించింది.