నన్ను కామెంట్ చేసిన వారికి సమాధానం!

రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ హీరోగా, ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా, క్లాప్స్ అండ్ విజిల్స్ బ్యాన‌ర్ లో ఎస్.కె స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం ‘గుంటూరోడు’. ఈ సినిమాకు సంబంధించి మంచు మనోజ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

”రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయాల‌ని న‌న్ను సోష‌ల్ మీడియా ద్వారా అడుగుతుంటారు. కానీ మా నాన్న‌గారు ఆత్మ‌గౌర‌వం, ఆత్మ‌మాభిమానం, సంతృప్తి అనేవి న‌టుడుకి చాలా ముఖ్య‌మ‌ని చెబుతుంటారు. స‌క్సెస్ ఫెయిల్యూర్‌లో వ‌ర్క్‌ను ఎంజాయ్ చేయ‌మ‌ని అంటుంటారు. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల్లో ఒక మంచి పాత్ర చేయాల‌ని ప్ర‌య‌త్నించాను. న‌టుడిగా నిరూపించుకోవాల‌నే వ‌చ్చాను త‌ప్ప‌, ఏదో పెద్ద హీరో అయిపోవాల‌ని రాలేదు. నాకు వ్యాపారాలు రావు. అంద‌రికీ న‌చ్చేలా న‌టించ‌డ‌మే నాకు వ‌చ్చు. నేను చేసిన పాత్ర‌లు నాకు సంతృప్తినిచ్చాయి.న‌టుడుగా న‌న్ను ముందుకు తీసుకెళ్లాయి. నాకు న‌చ్చిన పాత్ర‌లే చేశాను, ఇక‌పై కూడా అలాగే చేస్తాను. ఇన్ని సంవ‌త్స‌రాలు నుండి అబిమానులు అడుగుతున్నారు కాబ‌ట్టి, కొత్త‌ద‌నం ఉన్న సినిమాల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కూడా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను. అందులో భాగంగా గుంటూరోడు సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాను. అలాగే నేను లావ‌య్యానని కూడా చాలా మంది అంటున్నారు. కానీ ఒక్క‌డు మిగిలాడు అనే సినిమాలో ఎల్‌.టి.టి.ఇ కు చెందిన క్యారెక్ట‌ర్ చేశాను. 1990కు చెందిన గెట‌ప్‌, స‌ముద్రంలో ఓ గెట‌ప్ , 2017లో ఓ గెట‌ప్ ఇలా వేరియేష‌న్స్ క‌న‌ప‌డ‌తాయి. అందుక‌నే ఆ సినిమా మ‌ధ్య‌లో వ‌చ్చిన సినిమాల్లో నేను అలా క‌న‌ప‌డ్డాను. మ‌రో మూడు నెలల్లో ఒక్క‌డు మిగిలాడు సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాను. ఆ సినిమాలో నా డేడికేష‌న్ మీకు క‌న‌ప‌డుతుంది” అన్నారు.