నా జీవితం ఈ నేల యువతకు అంకితం : మంచు మనోజ్

డైలాగ్‌ కింగ్ మంచు మోహన్‌బాబు తనయుడు హీరో మంచు మనోజ్‌ నటనకు దూరమవుతున్నారని, రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారని నెటిజన్ల అభిప్రాయం. గతంలో ఒకసారి తాను ఇక సినిమాలు చేయబోనని ప్రకటించి, అభిమానుల కోరిక మేరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అభిమానులకు మనోజ్ ఓ లేఖ రాశారు. తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నట్లు లేఖలో వెల్లడించారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్తున్నట్టు తెలిపారు.

“తన వల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకోవడానికి ‘పరుగు’ కూడా ఒక రోజు పరిగెత్తడం ఆపేస్తుంది. ఇవాళో రేపో ప్రతి ఒక్కరికీ ఈ పరిస్థితి తప్పదు. గమ్యంలేని లక్ష్యాలు ఎప్పటికైనా మనశ్శాంతిని దూరం చేస్తాయి. మన ప్రతీ లక్ష్యానికి ఓ గోల్‌ ఉండాలి. ఆ లక్ష్యం మన చుట్టూ ఉండే ప్రజల్ని ఉద్ధరించేలా ఉండాలి. ప్రపంచం మొత్తం తిరిగాను.. అన్ని జాతులు, మతాలు, కులాల ప్రజల్ని కలిశాను. ఒక్క చిన్న బ్రెడ్‌ ముక్క కోసం గ్యారేజ్‌లో పనిచేసే వాళ్లనూ చూశాను. ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాను.
స్నేహితుల కోరిక మేరకు కొన్ని సినిమాల్లోనూ అతిథి పాత్రల్లో నటించాను. అన్నీ సంతృప్తితో చేశాను.

కానీ నా చుట్టూ ఉండే ప్రజల సంతోషం కోసమే ఇవన్నీ చేశాను. ప్రపంచంలోని ప్రతి దిక్కూ తిరిగాను. దేశంలోని ప్రతి మూలా చూశాను. ఆ దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం అద్భుతం, అమోఘం. నేను కోరుకునే మనశ్శాంతి నాకు తిరుపతిలో దొరికిందని కచ్చితంగా చెప్పగలను. నేను పెరిగిన ప్రదేశం, నా ఎదుగుదలకు కారణమైన ప్రదేశం తిరుపతి. స్వేచ్ఛగా ప్రపంచానికి రెక్కలు విప్పుకొని ఎగిరేలా చేసింది ఈ ప్రదేశం. అణువణువు దైవత్వంతో నిండి ఉన్న ఈ తిరుపతి గాలి పీల్చినప్పుడు ఏదో తెలియని శక్తి నన్ను ఆవహిస్తుంది.

పిల్లల విద్యకు సహాయం చేస్తాను. తిరుపతి నుంచి మొదలయ్యే ఈ సహాయం ప్రపంచమంతా చేరువయ్యేలా తపిస్తాను.. ముందుగా ఇక్కడి యువతకి సహాయపడేలా ఏదైనా చేస్తాను. నా వల్ల ఈ లోకానికి కలిగే ప్రయోజనమేంటో వెతికే క్రమంలో కొన్ని నెలలు తిరుపతికి షిఫ్ట్‌ అవుతున్నాను. రాయలసీమలో ప్రారంభించే నా ఈ సరికొత్త ప్రయాణం ఇక్కడికే పరిమితం కాదు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కూడా ఈ అర్థవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తాను. నా సినీ, రాజకీయ జీవితంపై ఎవరు ఎలాంటి తీర్మానాలు చేయవద్దు. సినిమాలపై నాకున్న ఆసక్తి ఎప్పుడూ తగ్గదు.. విలక్షణ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాలనే దాహం ఎన్నటికీ తీరదు. నా జీవితాన్ని ఈ నేల యువతకు అంకితం చేస్తున్నాను. రాయలసీమ వస్తున్నా రాగి సంగటి, మటన్‌ పులుసు సిద్ధంగా పెట్టండి.. మీ మంచు మనోజ్‌” అని ఆయన లేఖలో పేర్కొన్నారు.