మారుతికి నాగార్జున సూచనలు!

కథ, కథనాల కంటే హీరో క్యారెక్టర్ ను బేస్ చేసుకొని సినిమాలు చేస్తుంటాడు మారుతి. తన సినిమాల్లో హీరోలకు ఏదొక లోపం ఉండేలా కథలు రాసుకుంటాడు. ‘భలే భలే మగాడివోయ్’ , ‘బాబు బంగారం’, ‘మహానుభావుడు’ చిత్రాలు ఈ కోవకు చెందినవే. ఇటీవల విడుదలైన ‘మహానుభావుడు’ సినిమా విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ సినిమా ‘భలే భలే మగాడివోయ్’ సినిమాను పోలి ఉందనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ఫార్ములతో ఉండే కథనే హీరో నాగచైతన్యకు కూడా వినిపించినట్లు తెలుస్తోంది.
దానికి చైతు అంగీకరించినా.. నాగార్జున మాత్రం ఇలా లోపం ఉన్న హీరో పాత్రలు కాకుండా.. కొత్త తరహా పాత్రలతో కూడిన కథను సిద్ధం చేసుకోమని మారుతికి సూచించినట్లుగా తెలుస్తోంది. ఒకే ఫార్ములతో సినిమాలు చేస్తూ ఉన్నా.. ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే నాగార్జున కూడా తన కొడుకు సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి మారుతి కథను సిద్ధం చేసి నాగార్జునను మెప్పిస్తాడో.. లేదో.. చూడాలి!