మహేష్‌.. నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు: నమ్రత


‘మహర్షి’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబును ఉద్దేశిస్తూ ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్‌ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఈరోజు బిగ్‌డే.. ‘మహర్షి’ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఓ అద్భుతమైన చిత్రాన్ని కానుకగా ఇవ్వడానికి నువ్వెంత కష్టపడ్డావో నేను కళ్లారా చూశాను. ఇప్పుడు ప్రపంచం ఆ కష్టాన్ని చూడబోతోంది. గుడ్‌ లక్‌ మై లవ్‌ మహేష్‌. ‘రిషి’ పాత్రను నేనెంతగా ఇష్టపడ్డానో అదే విధంగా అందరూ ఇష్టపడతారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

నమ్రత సందేశం కంటే.. అందరి దృష్టి ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోపైనే ఉంది. మహేష్‌ నమ్రత వెనక దాక్కుని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్న ఆ ఫొటో ఎంతో చూడముచ్చటగా ఉంది. ‘మహేశ్‌ చిన్నపిల్లాడిలా భార్య వెనక దాక్కున్నారు’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

‘మహర్షి’ సినిమా కోసం నమ్రత కూడా ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూనే ఉన్నారు. మహేష్‌ ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటే ఆయన సహ నటులు సినిమా గురించి మాట్లాడుతున్న వీడియోలను నమ్రత పోస్ట్‌ చేస్తూ వారికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహర్షి’ తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌ అందుకుంటోంది.