‘పడి పడి లేచె మనసు’ టీజర్‌

యంగ్‌ హీరో శర్వానంద్‌ నటిస్తున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. ఈ చిత్రంలో సాయిపల్లవి శర్వానంద్‌కు జంటగా కనిపించనుంది. హను రాఘవపూడి దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

కాగా టీజర్‌ను బుధవారం చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో శర్వానంద్..‌ సాయిపల్లవి వెంట తిరుగుతూ కనిపించారు. ఆమె ఎక్కడికి వెళితే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దీన్ని గమనించిన సాయిపల్లవి శర్వానంద్‌కి కోపంతో వార్నింగ్‌ కూడా ఇచ్చింది.

‘ఓయ్‌ లేవయ్యా… లే.. ఏంటి ఫాలో చేస్తున్నావా?’ అని సాయిపల్లవి ప్రశ్నించగా.. ‘అరె మీకు తెలిసిపోయిందా?.. అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చి మాట్లాడటం ఏం బాగోలేదండీ. ఏదో నేను అర కిలోమీటరు దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే..’ అని సమాధానం ఇచ్చారు శర్వానంద్‌. విభిన్నంగా ఉన్న ఈ ప్రచార చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. శర్వానంద్‌ ఇటీవల ‘మహానుభావుడు’ చిత్రంతో మంచి హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ‘ఎంసీఎ’ తర్వాత సాయిపల్లవి నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాను డిసెంబర్‌ 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌.