ఘనంగా రాజమౌళి కుమారుడి పెళ్లి వేడుక.. పల్లకి మోసిన ప్రభాస్‌, అనుష్క సందడి.!

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకను నిర్వహించారు. ఆదివారం రాత్రి వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేడుకకు రెండు రోజుల ముందే ప్రముఖులు ప్రభాస్‌, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా తదితరులు హాజరయ్యారు. ముందస్తు పెళ్లి వేడుక నుంచి చివరి ఘట్టం వరకు తారక్‌, ప్రభాస్, చరణ్‌, రానా రాజమౌళి కుటుంబీకులతో కలిసి సందడి చేశారు.

డ్యాన్సులతో రచ్చ చేశారు. కాగా..రాత్రి జరిగిన పెళ్లి వేడుకలో పెళ్లి కుమార్తె కూర్చున్న పల్లకిని ఆమె బంధువులతో పాటు ప్రభాస్‌ కూడా మోశారు. ప్రభాస్‌ పల్లకి మోస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. వేడుకలో ప్రభాస్‌, అనుష్క సందడి చేస్తున్న వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

‘bangaram saysSS’ అంటే..

రాజమౌళి కుమారుడి పెళ్లి సందడి మొదలైనప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ‘bangaram saysSS’ అనే హ్యాష్‌ట్యాగ్‌ వైరల్‌ అవుతోంది. అయితే ఈ హ్యాష్‌ట్యాగ్‌ వెనక ఉన్న అర్థం ఏంటేంటే.. కార్తికేయ.. తన భార్య పూజను బంగారం అని పిలుస్తారట. పూజ..కార్తికేయను ‘ss’ అని ఇంటి పేరుతో సంబోధిస్తారట. అందుకే శుభలేఖలోనూ ‘bangaram saysSS’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా అచ్చువేయించినట్లు తెలుస్తోంది.