ప్రజా వేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం


టీడీపీ హయాంలో రూ.కోట్ల ప్రజాధనాన్ని వ్యయం చేసి అమరావతిలో నిర్మించిన ప్రజావేదిక భవనం కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రజావేదిక నిర్మాణం కూల్చివేత పనులు మొదలుపెట్టారు. సీఎం ప్రకటించిన 24 గంటల్లో ఈ కట్టడం కూల్చివేతను ప్రారంభించిన సీఆర్డీయే అధికారులు ప్రస్తుతం ఆ
ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జేసీబీలు, వంద మందికి పైగా కూలీలు కూల్చే పనిని చేపట్టారు. ఈ రాత్రి 7గంటలకు కూల్చివేతను ప్రారంభించిన కూలీలు అర్ధరాత్రి కల్లా పూర్తి చేయనున్నారు. ప్రజావేదికకు ఆనుకొని తాత్కాలిక టెంట్లను ఇప్పటికే పూర్తిగా తొలగించారు. వేదిక లోపల ఫర్నిచర్‌, ఏసీలు, ఇతర సాంకేతిక సామగ్రిని సచివాలయంలోని
గోదాంకు తరలించారు. ప్రజావేదిక వద్ద ప్రహరీని జేసీబీతో కూల్చివేశారు. అక్కడ ఉన్న శిథిలాలను లారీల్లో తరలిస్తున్నారు. ప్రజావేదికలో ముందుగా ఎలివేషన్‌ కోసం ఏర్పాటుచేసిన అల్యూమినియం ఫ్రేమ్‌లు, అద్దాలతో చేసిన ఉపకరణాలు, ద్వారాలను జాగ్రత్తగా తొలగించి వాటిని పునర్వినియోగించేందుకు సీఆర్డీయే అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ప్రజావేదిక భవనం 2018లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సులతో పాటు ప్రభుత్వ సమావేశాలకు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా వరద ప్రవాహ మట్టానికి దిగువన ఉండటంతో వైసీపీ ప్రభుత్వం దీన్ని అక్రమకట్టడంగా తేల్చి కూల్చివేయాలని నిర్ణయించింది. సీఎం జగన్ 24
గంటల్లో కూల్చివేయాలని ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో సీఆర్డీయే అధికారులు యుద్ధప్రాతిపదికన కూల్చివేతను వేగవంతం చేశారు. ఈ అర్ధరాత్రికి ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉంది.