విజయ్ తో రాజ్ తరుణ్ సినిమా!

యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం తను అంగీకరించిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ‘రాజుగాడు యమ డేంజర్’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అలానే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న మరో చిత్రంలో కూడా రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ కుమార్ కొండ మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత తెరకెక్కించిన ‘ఒక లైలా కోసం’ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మరో సినిమా చేయడానికి విజయ్ కు చాలా గ్యాప్ వచ్చింది. 
మధ్యలో అతడు తన ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు మళ్ళీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. రాజ్ తరుణ్ హీరోగా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ నెల నుండి పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ అందుకోలేని రాజ్ తరుణ్ కి ఈ సినిమా అయినా మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి!