రజనీ సొంత ఛానెల్‌ పెట్టనున్నారా..?

ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలు మనుగడలో ఉండాలంటే వాటికంటూ సొంత టీవీ ఛానెల్‌ ఉండటం తప్పనిసరిగా మారింది. ఇదే అంశాన్ని ఫాలో అవుతున్నారు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. అభిమానులు ఎన్నో ఏళ్లుగా తలైవా రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్‌ 31 తన పొలిటికల్‌ ఎంట్రీ గురించి ప్రకటించారు రజనీకాంత్‌. ‘మక్కల్‌ మంద్రమ్‌’ అనే పార్టీని స్థాపించిన రజనీకాంత్‌.. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతానని కూడా ప్రకటించారు. పార్టీ పేరును అనౌన్స్‌ చేశారు. కానీ అది ఇంకా పూర్తిస్థాయిలో రూపుదాల్చలేదు.

ప్రస్తుతం రజనీ పార్టీ నిర్మాణ కార్యకలపాలను ఓ ప్రముఖునికి అప్పజెప్పారనే వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ క్రమంలో త్వరలోనే రజనీకాంత్‌​ పేరు మీద ఓ టీవీ ఛానెల్‌ను కూడా ప్రారంభించబోతున్నారనే విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రజనీ టీవీ పేరుతో ఓ ట్రేడ్‌ మార్క్‌ను కూడా రిజిస్టర్‌ చేయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాక ప్రస్తుతం ట్రేడ్‌ మార్క్‌ లోగోకు సంబంధించిన ఫోటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఇప్పటివరకూ ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక సమాచారం తెలియలేదు. ఇక సినిమాల విషయానికోస్తే ర‌జ‌నీకాంత్ న‌టించిన పేట్టా విడుదలకు సిద్ధంగా ఉంది.