వర్మ ‘వెన్నుపోటు’ వెన్నులో వణుకు పుట్టిస్తుంది

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలోని ‘వెన్నుపోటు’ పాటను శుక్రవారం తన ట్విటర్‌ ద్వారా రిలీజ్‌ చేశారు రామ్‌ గోపాల్‌ వర్మ. పేరుకు తగ్గట్టే పాట ఫస్ట్‌లుక్‌లో ఎ‍న్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును, ఇతర నాయకులను, వెన్నుపోటుకు వేదికగా నిలిచిన వైశ్రాయ్‌ హోటల్‌ను చూపించారు.

దొంగప్రేమ నటనలు చూపి కలియుగాన శకునులై చేరినారు.. కన్నవాళ్లు అక్కర తీరి వదిలి వేసినారు.. అసలు రంగు బయటపెట్టి కాటు వేసినారు.. ఒంటరిని చేసి గుంపు దాడి చేసి.. సొంత ఇంటి నుంచే వెలి వేసినారు అంటూ సాగుతున్న లిరిక్స్‌ ఎన్టీఆర్‌ మనోవేదనకు అద్దం పడుతున్నాయి. గీత రచయిత సిరాశ్రీ రాసిన ఈ పాటకు కల్యాణ్‌ మాలిక్‌ సంగీతం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. కాగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఆధారంగా.. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘కథానాయకుడు’ ఆడియో విడుదల రోజే వర్మ వెన్నుపోటు పాటను విడుదల చేయడం ద్వారా ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. రిలీజ్‌ చేసిన గంటలోనే దాదాపు లక్ష వ్యూస్‌ రావడం విశేషం.