‘రాజారథం’లో రానా దగ్గుబాటి?

జనవరి 25, 2018న విడుదలకి సిద్దమవుతున్న ‘రాజారథం’ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా భాగమైనట్టు తెలుస్తోంది. ‘బాహుబలి’లో ‘భళ్లాలదేవుని’గా మెప్పించిన రానా పార్టిసిపేషన్‌ ఎలాంటిది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఆకట్టుకునే ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌తో ‘రాజరథం’పై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు రానా కూడా ఈ టీమ్‌తో కలవడం వల్ల సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. రొమాంటిక్‌ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రంతో హీరో, హీరోయిన్లుగా నిరూప్‌ భండారి, అవంతిక షెట్టి తెలుగు తెరకు పరిచయం అవనున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తమిళ స్టార్‌ హీరో ఆర్య, పి.రవిశంకర్‌ కనిపిస్తారు.
ఇప్పుడు దర్శకుడు అనూప్‌ భండారి ఈ చిత్రానికి కథ, పాటలు, సంగీతం అందించటం తో పాటు కొన్ని పాటలు కూడా పాడటం విశేషం. నిరూప్‌ భండారి హీరోగా అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన ‘రంగి తరంగ’ చిత్రాన్ని యు.ఎస్‌, యూరప్‌ దేశాలలో పంపిణీ చేసిన ‘జాలీ హిట్స్‌’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా ‘రాజారథం’ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. నిర్మాత అజయ్‌రెడ్డి ఉత్తమ ప్రమాణాలతో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులకి అందించాలనే తపనతో టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ వరకు ఉన్న అత్యున్నత సాంకేతిక నిపుణులతో ఈ ‘రాజారథం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.