నేను పవన్ తో ఉండాలని కోరుకోవద్దు!

అందరికీ నమస్కారం

నాలుగేళ్ళుగా ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియాలో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వరసగా అభ్యర్ధనలు, విన్నపాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే వున్నాయి. నేను నా ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియాలో ఎన్ని సార్లు వివరణ ఇచ్చినా ఇవి ఆగడం లేదు. అందుకే మరొకసారి చాలా స్పష్టంగా నా అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ క్రింది పోస్టు పెడుతున్నాను.

“ మిత్రులు..నా శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం.

మీరు నిరంతరం నా పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, నాకు అందిస్తున్న సహాయ సహకారాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితం గురించి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. కళ్యాణ్ గారు నాలుగేళ్ళ క్రితం “ఆనా” ను పెళ్ళిచేసుకున్నారు. వారికి ఒక చక్కటి కూతురు కూడా ఉంది. ఆయన వివాహ బంధాన్ని..ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను మీకు చేసుకునే విన్నపం ఒక్కటే. నేను, కళ్యాణ్ గారు తిరిగి ఏకం కావాలని మీరు పదేపదే కోరవద్దు. దయచేసి ఒక విషయం మీరంతా అర్థం చేసుకొని ఆమోదించాలి. అదేమిటంటే కళ్యాణ్ గారి భార్య ఆనా. నేను కాదు.

ఒకటి మాత్రం నిజం. ఆయన నా పిల్లలకు తండ్రి. నేనూ ఆయన మంచి స్నేహితులం మాత్రమే. కాని మేమెప్పటికీ తిరిగి భార్యాభర్తలం కాలేము. ఈ సత్యాన్ని నేను మనసా వాచా కర్మణా అంగీకరిస్తున్నాను. మీరు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను తిరిగి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళమని మాటిమాటికీ మీరు కోరడం సబబు కాదని గుర్తించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళడం అసమంజసం, అసాధ్యం, అర్థరహితం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులూ కలిగించే ఒత్తిడితో కూడిన కోరికలేవీ మీ వద్ద నుండి ఎదురు కావని ఆశిస్తున్నాను. ఎంతో నిజాయితీతో మనస్పూర్తిగా మీకు నేను చేసిన ఈ విన్నపాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని, ఎప్పటిలా మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాలను అందిస్తారని కోరుకుంటూ