HomeTelugu Big Storiesసాహో టికెట్‌ ధర అధరహో!

సాహో టికెట్‌ ధర అధరహో!

5 27

ఈ నెల 30న విడుదల కానున్న ‘సాహో’ సినిమా టికెట్ల ధరలను రాష్ట్రంలో కొన్ని థియేటర్‌ యాజమాన్యాలు అమాంతంగా పెంచేశాయి. దీంతో సామాన్య ప్రేక్షకులకు వినోదభారం తప్పడం లేదు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాకు సగానికిపైగా థియేటర్లు రేట్లు పెంచడం వినోద ప్రియులను కలవరపెడుతోంది. ఆన్‌లైన్‌లో టికెట్‌ కొనుగోలు చేసే ‘బుక్‌ మై షో’ వెబ్‌సైట్‌లో ఈ మేరకు పెంచిన ధరలు దర్శనమిస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా ఈ పెంచిన ధరలతోనే బుకింగ్‌లు జరుగుతున్నాయి. ఈ సినిమా శుక్రవారం విడుదలవనుంది. తరువాత శని, ఆదివారాలు సెలవు దినాలు రావడం, సోమవారం వినాయక చవితి కావడంతో సినిమా బుకింగ్‌లు అమాంతం పెరిగాయి.

సాధారణంగా నాన్‌ ఏసీ థియేటర్లలో బాల్కనీ టికెట్‌ ధర రూ.80, ఏసీ థియేటర్లలో రూ.125గా ఉంటుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక చాలా థియేటర్లు ఇవే ధరల్ని కొనసాగిస్తున్నాయి. కానీ కొన్ని మాత్రం అస్సలు పాటించడం లేదు. మొదటివారం వీలైనంత వసూలు చేసుకోవాలన్న ఆలోచనతో టికెట్‌ ధరలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ల్లో ఈ వ్యత్యాసం అధికంగా ఉంటోంది. వాస్తవానికి జీఎస్టీతో కలిపి మల్టీప్లెక్స్లో టికెట్ల ధర రూ.138 వద్ద మొదలై గరిష్టంగా రూ.150 వరకు ఉంది. కానీ, సాహో సినిమాకు ఈ వ్యత్యాసం మరీ పెరిగిపోయింది. కొన్ని రూ.175, ఇంకొన్ని రూ.230కి చేరింది. ఇక ఓ ప్రముఖ థియేటర్‌లో అయితే సోఫా టికెట్‌ ధర రూ.300, బాల్కనీ ధర రూ.200గా ఉంది. అయినా దీనిపై అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. ప్రస్తుతం అన్ని సినిమాలకు ఇవే థియేటర్లు వసూలు చేస్తోన్న మొత్తంలో సాహో సినిమాకు వసూలు చేస్తోన్న మొత్తంలో కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.150కి వరకు వ్యత్యాసం ఉండటం గమనార్హం. సామాన్యులకు అందుబాటులో ఉండే సెకండ్‌ క్లాస్‌ టికెట్‌ ధరలను సైతం భారీగా పెంచారు. చాలా థియేటర్లలో సెకండ్‌ క్లాస్‌ కనిపించకుండా పోతోంది.

సాహో చిత్రం అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారని ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. సాహో సినిమా టికెట్ల రేటు పెంపునకు అనుమతించలేదు. తమకు అన్ని సినిమాలు ఒక్కటేనని, ఒక్కో సినిమాను ఒక్కోలా చూడలేమని తేల్చి చెప్పింది. కాగా, మహర్షి సినిమా విడుదల సమయంలోనూ కొన్ని థియేటర్‌ యాజమాన్యాలు తమకు తామే టికెట్ల రేటు పెంచాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు. కానీ, రెండు మూడు రోజుల అనంతరం థియేటర్‌ యాజమాన్యాలు టికెట్ల రేట్లు తగ్గించడంతో వివాదం సద్దుమణిగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!