సమంత పెళ్లిచీర స్పెషాలిటీ!

అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ నెలలో జరగనుంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో ఈ వివాహం జరగనుంది. హిందూ సంప్రదాయ ప్రకారం జరిగే పెళ్లి కోసం సమంత చీర కట్టుకోబోతుంది. ఇంతకీ ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా..? అది నాగచైతన్య అమ్మమ్మ రాజేశ్వరి రామానాయుడు చీర. తన పెళ్లి దుస్తులను డిజైన్ చేయడానికి సమంత.. క్రేష బజాజ్ ను నియమించుకుంది. క్రేష.. ఆ చీరకు మెరుగులు దిద్ది సమంతకు అందించబోతున్నాడని తెలుస్తోంది. తన పెళ్లి రోజున చైతు అమ్మమ్మ చీరను ధరించడం ద్వారా అటు అక్కినేని కుటుంబానికి, ఇటు దగ్గుబాటి కుటుంబానికి గౌరవం ఇచ్చినట్లుగా ఉంటుంది.
ఆ చీరలో సమంత లుక్ చాలా ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు క్రేష. అలానే క్రైస్తవ సంప్రదాయ పద్ధతి ప్రకారం పెళ్లి జరపడానికి సమంత కోసం ఓ గౌనుని డిజైన్ చేస్తున్నారు. గోవాలో క్రైస్తవ పద్ధతిలో వివాహం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సమంత ఇప్పటికే తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చింది. అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో వివాహం జరగనుందని, అలానే తమకున్న కమిట్మెంట్స్ కారణంగా పెళ్లి జరిగిన మూడో రోజు నుండే సినిమా షూటింగ్స్ లో పాల్గొంటామని తెలిపింది.