చరణ్‌-ఉపాసన ఇండస్ట్రీని ఒకటి చేస్తున్నారు: సమంత

హీరో రామ్‌ చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన కలిసి చిత్ర పరిశ్రమను ఒకటి చేస్తున్నారని, అందరిలోనూ స్నేహభావాన్ని పెంచుతున్నారని హీరోయిన్‌ సమంత అన్నారు. ఆమె ‘బి పాజిటివ్- హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్’ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉపాసన ఈ మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫొటో షూట్‌లో భాగంగా తీసిన స్టిల్స్‌ను ఇటీవల ఉపాసన షేర్‌ చేశారు. ఈ మ్యాగజైన్‌ ఇంటర్వ్యూలో సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. చరణ్‌ దంపతుల మంచితనాన్ని మెచ్చుకున్నారు. ‘మీ (ఉపాసన, చరణ్‌) నుంచి నేను చాలా నేర్చుకున్నా. నాకు తెలిసి.. తనకు పోటీగా ఉన్న మరో ఆర్టిస్టు నటన నచ్చి, వాళ్ల ఇంటికి పుష్పగుచ్చం పంపించే సూపర్‌స్టార్‌ ఎవరూ లేరు. మీరిద్దరూ ఆ పనిచేసి.. చిత్ర పరిశ్రమను ఒకటి చేస్తున్నారు. మాకు కూడా స్ఫూర్తిగా నిలిచారు’ అని సమంత పేర్కొన్నారు.
ఇప్పటికే మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, పలువురు హీరోయిన్ల ఇళ్లకి చరణ్‌ పువ్వులు పంపారు. వెండితెరపై వారి నటనను ప్రశంసిస్తూ ఆయన ఇలా అందర్నీ విష్‌ చేస్తున్నారు. ‘మజిలీ’ సినిమా చూసిన తర్వాత చరణ్‌ దంపతులు చై-సామ్‌కు పువ్వులు పంపినట్లు సమాచారం.