నేనేమీ పాక్ జట్టుకి తల్లిని కాదు: సానియా మీర్జా

పాకిస్థానీ నటి వీణా మాలిక్‌.. ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాపై కామెంట్‌ చేశారు. గతంలో సానియా తన భర్త షోయబ్‌ మాలిక్‌, కుమారుడు ఇజాన్‌, ఇతర పాకిస్థానీ క్రికెటర్లతో కలిసి ఓ హుక్కా బార్‌కు వెళ్లారు. ఆ సమయంలో సానియా హుక్కా తాగుతున్నప్పుడు తీసిన వీడియోను ఓ నెటిజన్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ వీడియోను తొలగించేశారు. దీని గురించి వీణా మాలిక్‌.. సానియాను ట్యాగ్‌ చేస్తూ..

‘సానియా.. మీ అబ్బాయి విషయంలో నేను చింతిస్తున్నాను. మీరంతా కలిసి ఆ చిన్నారిని హుక్కా బార్‌కు తీసుకెళతారా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా? నాకు తెలిసినంత వరకు మీరు వెళ్లిన బార్‌లో ఎక్కువగా జంక్‌ ఫుడ్‌ అమ్ముతూ ఉంటారు. క్రీడాకారులైన మీరు, మీ భర్త ఇలాంటి ఆహారం తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఓ తల్లిగా మీకు ఈ విషయాలన్నీ తెలిసుండాలి’ అని పేర్కొన్నారు.
ఇందుకు సానియా స్పందిస్తూ.. ‘వీణా.. నేను నా కుమారుడిని ఎలాంటి బార్‌కు తీసుకెళ్లలేదు. అయినా ఈ విషయాలన్నీ మీకు అనవసరం. నేను నా బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో నాకు మాత్రమే తెలుసు. మరో విషయం గుర్తుంచుకోండి.. పాకిస్థానీ క్రికెటర్లు ఏం తింటారు, ఎప్పుడు నిద్రపోతారు వంటి విషయాలను పట్టించుకోవడానికి నేనేమీ పాక్‌ క్రికెట్‌ టీం డైటీషియన్‌ను కాను. వారి తల్లిని కాను.. ప్రిన్సిపల్‌ని కాను.. టీచర్‌ను అంతకన్నా కాను. ఏదేమైనా మీరు మా పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్నందుకు ధన్యవాదాలు. కొందరు నెటిజన్లు ఇలాంటి ట్వీట్లు చేస్తూ నాకు పిచ్చెక్కిస్తుంటారు. మీ ఫ్రస్ట్రేషన్‌ను పోగొట్టుకోవడానికి ఇతర మార్గాలను ఎంచుకోండి’ అని చురకలంటిచారు సానియా.

ఆదివారం జరిగిన భారత్‌, పాక్‌ మ్యాచ్‌లో దాయాది జట్టు ఓడిపోయింది. దాంతో పాక్‌కు చెందిన పలువురు నెటిజన్లు సానియాను ఉద్దేశిస్తూ వ్యంగ్య కామెంట్లు చేస్తున్నారు.