రివ్యూ: శతమానం భవతి

నటీనటులు: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ, ఇంద్రజ, నరేష్ తదితరులు
సంగీతం: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటింగ్: మధు
నిర్మాత: దిల్ రాజు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సతీష్ వెగ్నేస

శర్వానంద్, అనుపమపరమేశ్వరన్ జంటగా సతీష్ వెగ్నేస దర్శకత్వంలో దిల్ రాజు రూపొందించిన చిత్రం ‘శతమానం భవతి’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పటికీ తమ సినిమా మీద ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలోకి దించారు. మరి వారి నమ్మకం ఎంతవరకు నిజమైందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం అనే వూర్లో రాఘవరాజు(ప్రకాష్ రాజ్), జానకమ్మ(జయసుధ) అనే వృద్ధ దంపతులు నివశిస్తుంటారు. వారి ఇద్దరు కొడుకులు, కూతురు విదేశాల్లో స్థిర పడిపోవడంతో రాఘవరాజు తన భార్య, మనవడు రాజు(శర్వానంద్)తో కలిసి ఆత్రేయపురంలో జీవిస్తుంటారు. కానీ తమను చూడడానికి బిడ్డలు విదేశాల నుండి రావట్లేదనే బాధ రాఘవరాజుని వెంటాడుతూ ఉంటుంది. దీనికోసం ఆయన ఒక ప్లాన్ వేసి విదేశాల నుండి పిల్లల్ని రప్పించాలనుకుంటాడు. అనుకున్నదే తడవుగా తన ప్లాన్ ను ఆచరించి పిల్లలంతా సంక్రాంతికి ఇంటికి వచ్చేలా చేస్తాడు. ఆస్ట్రేలియా నుండి వచ్చిన రాఘవరాజు మనవరాలు నిత్య(అనుపమ పరమేశ్వరన్), తన బావ రాజుతో ప్రేమలో పడుతుంది. సంక్రాంతి పండుగ సంతోషంగా జరుగుతుందనుకుంటున్న తరుణంలో రాఘవరాజు బిడ్డల్ని రప్పించడానికి వేసిన పథకం తెలిసి జానకమ్మ ఆయనతో గొడవపడుతుంది. దీంతో కుటుంబాలో విబేధాలు ఏర్పడతాయి. అసలు రాఘవరాజు వేసిన ప్లాన్ ఏంటి..? దేన్ని ఆశించి ఆయన బిడ్డల్ని ఫారెన్ నుండి ఇండియాకు రప్పించారు..? రాజు, నిత్య ల ప్రేమకు ఇంట్లో వారంతా ఒప్పుకుంటారా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
సంగీతం
సినిమాటోగ్రఫీ
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్
ఇరికించిన కామెడీ

విశ్లేషణ:
కనిపెంచిన తల్లి తండ్రులను మర్చిపోయి స్వార్ధంగా తమ జీవితలను మాత్రమే చూసుకుంటూ.. సొంతూరిని, తల్లితండ్రులను పక్కన పెట్టేసిన పిల్లలకు కుటుంబ విలువలను తెలియజేసే చిత్రమే ‘శతమానం భవతి’. కుటుంబ కథా నేపధ్యంలో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. అయితే అటువంటి కథలను కూడా కొత్తగా ప్రెజంట్ చేస్తే గనుక సినిమాను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఈ చిత్ర దర్శకుడు సతీష్ వెగ్నేస కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. చిన్న ట్విస్ట్ తోనే కథను మొత్తం చక్కగా నడిపించాడు. అయితే ఫస్ట్ హాఫ్ తీసినంత బాగా రెండో భాగం తీయలేకపోయాడు. సెకండ్ హాఫ్ లో కాస్త స్లో అవ్వడంతో అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది. ఎప్పుడైతే కథ క్లైమాక్స్ కు వస్తుందో.. ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోతారు. కుటుంబ విలువల గురించి చెప్పే సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి.

శర్వానంద్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. తెరపై శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ పోటీ పడి నటించారు. తెరపై వారిద్దరి జంట చూడముచ్చటగా ఉంది. ప్రకాష్ రాజ్, జయసుధ ల నటన సినిమాకు మ్రో హైలైట్. వారిద్దరిని ఎన్నుకొని దర్శకుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. హీరోయిన్ తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ కనిపించింది. ఈ సినిమా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ దోహదపడుతుంది. రాజారవీంద్ర, నరేష్ మిగిలిన తారాగణం వారి పాత్రల పరుధుల్లో చక్కగా నటించారు. ఈ సినిమాకు మరో ప్లస్ మిక్కీ జె మేయర్ సంగీతం. పాటలకు తగ్గ లొకేషన్స్..ఆకట్టుకున్నాయి. విజువల్ గా సినిమా ఎక్కడా తగ్గకుండా.. పల్లెటూరి వాతావరణాన్ని అందంగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

రేటింగ్: 3/5