HomeTelugu Big Storiesప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత

ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత

2 26
ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు. విజయనిర్మల తండ్రి స్వస్థలం చెన్నై, తల్లి స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. తన మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు విజయనిర్మల.

విజయనిర్మల అసలు పేరు నిర్మల. తనకు సినీ పరిశ్రమలో మొదటిసారి అవకాశమిచ్చిన విజయ స్టూడియోస్‌కు కృతజ్ఞతగా విజయనిర్మలగా పేరు మార్చుకున్నారు. అంతేకాక అప్పటికే నిర్మలమ్మ పరిశ్రమలో నిలదొక్కుకొని ఉండడం కూడా ఓ కారణం. ప్రముఖ నటుడు నరేశ్‌ విజయనిర్మల కుమారుడు. నటి జయసుధకు ఈమె పిన్ని. 1950లో మత్య్సరేఖ అనే తమిళ చిత్రం ద్వారా విజయనిర్మల తన ఏడో ఏటనే బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 11వ ఏట పాండురంగ మహత్యం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగులో రంగులరాట్నం చిత్రంలో విజయనిర్మల హీరోయిన్‌గా మొదటి సినిమా.

సుమారు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పిన్ని తదితర చిత్రాల్లో నటించారు. పెళ్లి కానుక సీరియల్‌తో బుల్లితెరపైనా అలరించారు. ఏడేళ్ల వయస్సులోనే ఆమె సోదరి రావు బాలసరస్వతి వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. పి.పుల్లయ్య దర్శకత్వంలో తొలిసారిగా ఆమె కెమెరా ముందుకు వచ్చారు. కృష్ణుడి వేషంలో బాలనటిగా చిత్రపరిశ్రమలో విజయ నిర్మల అడుగుపెట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu