సునీల్ కు కష్టకాలం!

కమెడియన్ నుండి హీరోగా టర్న్ అయిన సునీల్ మొదట్లో రెండు, మూడు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ రాను రాను అతడు చేసే సినిమాలు రొటీన్ గా ఉండడంతో వరుస ఫ్లాపులు చవి చూశాడు. అతడు నటించిన ఆఖరి సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా డిజాస్టర్ అయింది. ఆ ప్రభావం ప్రస్తుతం సునీల్ నటిస్తోన్న ‘ఉంగరాల రాంబాబు’ సినిమాపై పడింది. ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా కాలం అవుతున్నా ఇంకా విడుదలకు నోచుకోవడంలేదు. ఈ సినిమాకు బిజినెస్ జరగడం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
సునీల్ గత చిత్రాల రిజల్ట్స్ దృష్టిలో పెట్టుకున్న బయ్యర్లు నిర్మాత చెప్పిన రేట్లకు సినిమాను కొనడానికి ముందుకు రావడం లేదట. ఓ మోస్తరు బడ్జెట్ లోనే సినిమాను నిర్మించాడు పరుచూరి ప్రసాద్. కానీ ఆయన ఆశించినట్లుగా బిజినెస్ మాత్రం జరగడం లేదు. వాస్తవానికి వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు కానీ విడుదలకు సిద్ధం చేయలేని పరిస్థితి. జూన్ లో అయినా ఈ సినిమాను విడుదలచేయాలనుకుంటే ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరి ఈ సినిమా విడుదలకు సునీల్ ఎలాంటి ప్లాన్ చేస్తాడో.. చూడాలి!