బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తి ఎట్టకేలకు అజ్ఞాతం వీడింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి రియా కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కావాలని రియాకు ఈడీ నోటీసులు జారీచేసింది. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయలు ట్రాన్స్ ఫర్ కావడంపై ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు రియా హాజరైంది. సుప్రీంకోర్టులో రియా చక్రవర్తి తన పిటిషన్ విచారణకు వచ్చేంత వరకు తన స్టేట్ మెంట్ ను రికార్డు చేయవద్దని ఈడీని కోరింది. రియా విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు.