
సూపర్‌స్టార్ రజనీకాంత్, విజయ్ గురించి నోరు జారానని దర్శకుడు రాజుమురగన్ క్షమాపణ కోరారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘జిప్సీ’. జీవా, నటాషా సింగ్ జంటగా నటించారు. ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో రాజుమురగదాస్ రజనీ, విజయ్‌లపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. నటులకు సూపర్‌స్టార్, తలపతి అనే ట్యాగ్‌లు ఉంటాయని, మరి అదే సినిమాలో నటించిన నటికి అలాంటి ట్యాగ్‌లు ఎందుకు ఉండవని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శకుడి తీరును వ్యతిరేకిస్తూ కామెంట్లు చేశారు.
సోషల్‌మీడియాలో విమర్శలు ఎక్కువ కావడంతో రాజుమురగదాస్ క్షమాపణలు కోరారు. ‘పొరపాటున నోరు జారాను. ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. నేను చేసిన వ్యాఖ్యలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. రజనీ, విజయ్ చిత్ర పరిశ్రమలో ఎంతో విజయవంతంగా రాణిస్తున్నారు. తమ శ్రమ, అంకితభావంతో చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేస్తున్న వారిపై నాకు చాలా గౌరవం ఉంది’ అని ఆయన పేర్కొన్నానని వివరణ ఇచ్చారు.













