టీడీపీలోకి జూనియర్‌ ఎన్టీఆర్.. పార్టీ వర్గాల్లో చర్చ!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత జూనియర్ ఎన్టీఆర్‌ను మళ్లీ టీడీపీలోకి తీసుకురావాలనే ప్రచారం జోరుగా సాగింది. మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే వాదనలు కూడా వినిపిస్తుంది. అయితే దీనిపై టీడీపీ నేతలెవరూ అధికారికంగా స్పందించలేదు. అటు జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ రకమైన ప్రచారంపై ఎక్కడా స్పందించలేదు. కొంతకాలం ఈ రకమైన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినా… మొన్నీమధ్య జరిగిన హరికృష్ణ ప్రథమ వర్థంతిలో చంద్రబాబు, ఎన్టీఆర్ కలుసుకోవడంతో మరోసారి ఈ ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది.

టీడీపీ వ్యవహారాలపై చంద్రబాబు, ఎన్టీఆర్ చర్చించారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే దీన్ని టీడీపీ వర్గాలు కానీ, ఎన్టీఆర్ సన్నిహితులు కానీ ధృవీకరించలేదు. ఈ క్రమంలోనే బాలకృష్ణ చిన్నల్లుడు, ఇటీవల విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు టీడీపీతో పాటు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని భరత్ అన్నారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ అవసరం పార్టీకి ఉంది అనుకుంటే… ఆయన పార్టీలోకి వచ్చే ఉద్దేశ్యం ఉంటే.. అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు.

తనతో పాటు ఎవరికైనా పార్టీనే సుప్రీం అన్నారు శ్రీభరత్. ఎన్టీఆర్ జనాలను ప్రభావితం చేసే వ్యక్తి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే కానీ… రాజకీయాల్లోకి రావాలంటే.. అధినేత ఆలోచించి, పలానా వ్యక్తి రావాలని భావించాలి. అలాగే పార్టీలోకి రావాలని వచ్చే వ్యక్తి(ఎన్టీఆర్) కూడా అనుకోవాలన్నారు. అయినా జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ వస్తేనే టీడీపీకి మంచిదంటే తాను ఒప్పుకోనని వ్యాఖ్యానించారు.

అయితే శ్రీభరత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక ఇది చంద్రబాబు, బాలకృష్ణ మనసులోని మాట అనే అంశంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ అధినాయకత్వమే తమ మనసులోని మాటను బాలయ్య చిన్నల్లుడి ద్వారా చెప్పించిందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌పై భరత్ ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదని… కానీ ఆయన ఈ రకమైన కామెంట్స్ చేయడం వెనుక కచ్చితంగా పార్టీ అధినాయకత్వం ఉండి ఉంటుందనే ప్రచారం కూడా సాగుతోంది.