ఇష్క్‌ రివ్యూ..

తేజా సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇష్క్’. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది‌. క్రేజీ కాంబినేషన్ లవ్ స్టోరీ ఊహిస్తే.. నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇష్క్ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశారు. ఈ సినిమా టైటిల్ ప్రకటించిన ద‌గ్గ‌ర నుంచి అంద‌రిలో ఆస‌క్తి పెంచుతూ వ‌చ్చింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య ఈరోజు శుక్రవారం (జూలై 30)న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ రివ్యూలో చూద్దాం..

కథ: వైజాగ్‌కు చెందిన సిద్దార్థ్‌ అలియాస్‌ సిద్దు ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అనసూయ అలియాస్‌ అను(ప్రియా ప్రకాశ్‌ వారియర్‌)తో ప్రేమలో ఉంటాడు. అను పుట్టిన రోజు సందర్భంగా ఆమెతో లాంగ్‌ డ్రైవ్‌ ప్లాన్‌ చేస్తాడు సిద్దు. కారులో అను ని తీసుకొని వైజాగ్‌ బీచ్‌ రోడ్‌కి వెళ్తాడు. ఇద్దరు కలిసి డే మొత్తాని ఎంజాయ్‌ చేస్తారు. సాయంత్రం సమయంలో అనుని ఓ ముద్దు ఇవ్వమని కోరతాడు సిద్దు. దాని వల్ల వీరికి ఓ పెద్ద సమస్య వచ్చిపడుతుంది. అను, సిద్దు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసిన మాధవ్‌(రవీందర్‌), పోలీసు ఆఫీసర్‌ని అని చెప్పి వారికి బ్లాక్‌ మెయిల్‌ చేస్తాడు. రాత్రంతా కారులోనే వారితో ప్రయాణం చేసి, అనుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. పోలీసు ఆఫీసర్‌ అనే భయంతో మాధవ్‌ని సిద్దు ఏం చేయలేకపోతాడు. కట్‌ చేస్తే.. మరుసటి ఉదయం సిద్ధుకి మాధవ్‌ గురించి ఓ నిజం తెలుస్తుంది. ఇంతకి సిద్ధుకి తెలిసిన నిజం ఏంటి? మాధవ్‌ నిజంగా పోలీసు ఆఫీసరా? కాదా? తన ప్రియురాలితో అసభ్యకరంగా ప్రవర్తించిన మాధవ్‌కు సిద్ధు ఏ విధంగా బుద్ది చెప్పాడు? చివరకు అను, సిద్ధుల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ.

నటీ నటులు: సిద్దు పాత్రలో తేజ సజ్జ బాగానే నటించాడు. ఫస్టాఫ్‌లో రొమాంటిక్‌ యాంగిల్‌లో కనిపించిన సిద్దు. సెకండాఫ్‌లో రివేంజ్‌ తీర్చుకునే ప్రేమికుడిగా అద్భుతంగా నటనను కనబరిచాడు. భయపడుతూనే.. తమ జంటను హింసించిన విలన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాడు. అను పాత్రలో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మెప్పించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో బాగానే చేసింది. ఇక శాడిస్ట్‌ పాత్రలో రవీంద్ర విజయ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీ, నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ : మలయాళం ఇష్క్‌ సినిమాకి రీమేకే.. ఇష్క్‌.. నాట్‌ ఏ లవ్‌ స్టోరీ. ఆ సినిమాలో కొన్ని మార్పులు, చేర్పులు చేసిన డైరెక్టర్‌ యస్‌ యస్‌ రాజు తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఫస్టాఫ్‌ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్లుగా ఉంటుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్లను విలన్‌ వేధించిన తీరు మరీ లెంతీగా చూపించడం సినిమాకు ప్రతికూల అంశమే. అలాగే సెకండాఫ్‌లో కూడా హీరో రివేంజ్‌ తీర్చుకునే సన్నివేశాలు కూడా సాగదీతగా, బోరింగ్‌గా ఉంటాయి.

ఒకే పాయింట్‌ని పట్టుకొని సాగదీయడం సినిమాకి పెద్ద మైనస్‌. జంటలపై దాడుల, వేధింపులు అనే పాయింట్‌ కొత్తగానే ఉన్నా.. తెరపై ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. అయితే ఎండింగ్‌లో సిద్ధు, అనుల మధ్య వచ్చిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుట్టుంది. ఇక సినిమాకి ఉన్నంతలో ప్లస్‌ పాయింట్‌ ఏంటంటే మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌ సంగీతం. ఒక్క పాట మినహా మిగతా పాటలు ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది.

టైటిల్: ఇష్క్‌
న‌టీన‌టులు: తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌
ద‌ర్శ‌క‌త్వం: య‌స్‌.య‌స్‌. రాజు
నిర్మాతలు :ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌

సంగీతం: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌

హైలైట్స్: తేజ నటన

డ్రాబ్యాక్స్: ఫస్టాఫ్‌
చివరిగా: ‘ఇష్క్‌’ ఈజ్‌ ఏ బోరింగ్‌ స్టోరీ
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

CLICK HERE!! For the aha Latest Updates