HomeTelugu Big Storiesస్టేజ్‌-3 రానీయొద్దు.. ఈటల హెచ్చరిక

స్టేజ్‌-3 రానీయొద్దు.. ఈటల హెచ్చరిక

5 21
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు 14 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని సూచించారు. అలాంటి వారు స్వీయ నియంత్రణ పాటించాలని.. కుటుంబసభ్యులు కూడా వాళ్లని బయటకు వెళ్లకుండా చేయాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33కి చేరిందని ఆయన ప్రకటించారు. మరో 97 మంది అనుమానితులు ఉన్నారని.. వారి నివేదికలు రావాల్సి ఉందని ఆయన వివరించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. క్వారంటైన్‌లో ఉన్న వాళ్లను 14 రోజుల తర్వాత పరీక్షలు చేసి ఇంటికి పంపిస్తామని చెప్పారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు మాత్రం బయట తిరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని.. వారిపై కేసులు తప్పవని మంత్రి హెచ్చరించారు. మొబైల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ట్రాక్‌ చేసి వాళ్లను పట్టుకుంటామన్నారు.

జనతా కర్ఫ్యూలో చూపిన స్ఫూర్తిని జనం ఈ రోజు చూపించడంలేదని ఈటల ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని లాక్‌డౌన్‌ ప్రకటిస్తే.. కొందరు మాత్రం ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా బయటకు వస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. ప్రాణాలు ముఖ్యమా? వైరస్‌ బారినుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం ముఖ్యమా? అని ప్రశ్నించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి చెప్పారు. కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేశామని.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది సైతం విధులకు రావాలని స్పష్టం చేశారు. పరిస్థితి విషమిస్తే ప్రైవేట్‌ ఆస్పత్రులను వినియోగించుకుంటామన్నారు. సాధారణ ఓపీలు, అత్యవసరం కాని చికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్లొద్దని కోరారు.

ఈ పది రోజులు చాలా కీలక సమయమని.. ఓపికతో ఉంటే దీన్ని తరిమికొట్టే అవకాశం ఉంటుందని ఈటల చెప్పారు. బాధితుల సంఖ్య పెరగకుండా ముందు జాగ్రత్తలు పాటిద్దామని పిలుపునిచ్చారు. వైరస్‌ సోకిన తర్వాత నయం చేయడం చాలా కష్టమనే విషయం ప్రపంచానికి అర్థమైందన్నారు. నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని.. ఎవరికి వాళ్లు ఇళ్లలో ఉండటమే కరోనా నిరోధానికి సరైన చికిత్స అని ఆయన వివరించారు. ఇవాళ స్టేజ్‌-2లో ఉన్నామని.. స్టేజ్‌-3 పరిస్థితి రానీయొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు అందరూ సహకరించాలని.. ఈనెల 31 వరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు ఈటల సూచించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu