బాపినీడు భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళి

టాలీవుడ్ దర్శక దిగ్గజం విజయ బాపినీడు ఈరోజు ఉదయం అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ మరణించారు. 1980-90 కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించిన దర్శకుల్లో విజయ బాపినీడు ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. విజయ బాపీనీడు ఇకలేరు అనే మాట వినగానే.. టాలీవుడ్ షాక్ తిన్నది. దర్శక దిగ్గజానికి టాలీవుడ్ ఇండస్ట్రీ నివాళులు అర్పించింది. బాపినీడు ఇకలేరన్న సమాచారం అందుకున్న చిరంజీవి బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. బాపినీడు మరణం తననెంతగానో కలచివేసిందని చిరంజీవి అన్నారు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఆయన ఇంట్లోనే ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ నుంచి బాపినీడుతో ఆరు సినిమాలు చేశానని, తన అభిమానులంటే ఆయనకు ఎంతో ఇష్టమని అన్నారు. ‘ఇతర హీరోలతో కూడా సినిమాలు చేయొచ్చు కదా.. అని నేను ఆయనతో అంటూ ఉండేవాడ్ని. నాతో సినిమాలు తీయడం ప్రారంభించిన తర్వాత ఆ కంఫర్ట్ కానీ, సెంటిమెంట్‌ కానీ మరొకరితో కుదరడంలేదని అన్నారు. నేను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఎక్కడ ఇల్లు తీసుకోవాలా? అని అనుకుంటున్న సమయంలో ఆయన గెస్ట్‌హౌస్‌లో ఉండమని చెప్పారు. చాలా కాలం పాటు అక్కడే ఉన్నాను’ అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు, నటుడు శివాజీ రాజా కూడా బాపినీడు నివాసానికి చేరుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. తాను బాపినీడు ఎన్నో సినిమాలు చేశారన్నారు. చిరంజీవి-బాపినీడు కాంబినేషన్‌లో వచ్చే సినిమాల కోసం తామంతా ఎదురుచూసే వాళ్లమని, ఆయన తీసిన సినిమాలు మరచిపోలేనివని కొనియాడారు.

మెగా హీరో అల్లు అర్జున్ విజయ బాపినీడు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయబాపినీడు చేసిన సినిమాల గురించి, ఆయన దర్శకత్వ పటిమ గురించి అల్లు అర్జున్ మాట్లాడారు. విజయ బాపినీడు వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని బన్నీ పేర్కొన్నారు.