సానియా మీర్జా కొడుకుతో ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల.. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కొడుకు ఇజాన్‌తో సరదాగా గడిపారు. ఇజాన్‌తో లండన్ వీధుల్లో డే అవుట్‌కు వెళ్లారు. బాబుతో సరదాగా ఆడుకున్నారు. ఈ ఫొటోలను తాజాగా ఆమె ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో సానియా మీర్జా, ఆమె సోదరి అనం మీర్జా కూడా ఉన్నారు.

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో క్రికెట్ ప్రపంచ కప్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రపంచ కప్ టోర్నీలో ఆడుతోన్న పాకిస్థాన్ జట్టులో సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కూడా ఉన్నాడు. అందుకే ఆమె మ్యాచ్‌లను తిలకించేందుకు గత కొద్ది రోజులుగా ఇంగ్లండ్‌లోనే ఉన్నారు. ఆమెతో పాటు అనం మీర్జా, ఆమె భర్త కూడా ఉన్నారు. వీరితో తాజాగా ఉపాసన కూడా కలిశారు. లండన్ వీధుల్లో ఇజాన్‌ను వెంటపెట్టుకుని వీరు చక్కర్లు కొట్టారు.

సానియా మీర్జాకు, ఉపాసనకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో రామ్ చరణ్, ఉపాసన కలిసి హైదరాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీని సందర్శించారు. అలాగే, న్యూ ఇయర్ రోజున సానియా, ఉసాసన, చెర్రీ మంచుతో ఆటలాడారు. ఇప్పుడు, సానియా కొడుకు‌ ఇజ్జుతోనూ ఉపాసన ఆటలాడుతున్నారు.

కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం ‘RRR’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఉపాసన తన వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ఇటీవలే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫ్యామిలీ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఆమె స్విట్జర్లాండ్ వెళ్లారు. అంతకు ముందు మాంచెస్టర్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ను వీక్షించారు. ఇప్పుడు మళ్లీ ఆమె లండన్‌లో పర్యటిస్తున్నారు.