మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్.. తన భార్య ఉపాసనను చూసి ఎంతో గర్వపడుతున్నారు. శనివారం ముంబయిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఉపాసన ఫిలాన్‌త్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా ఫాల్కే అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా ఉపాసన అవార్డు పట్టుకున్న ఫొటోను చెర్రీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ.. ‘డియరెస్ట్ ఉప్సీ.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఫిలాన్‌త్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు కంగ్రాట్స్’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 46 వేల మందికి పైగా లైక్ చేశారు.
అవార్డు అందుకున్న సందర్భంగా ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘చాలా సంతోషంగా ఉంది. సోషల్‌మీడియాలో నాకు మెసేజ్‌లు చేస్తూ, నన్ను మోటివేట్ చేస్తున్నవారికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నేను చేపట్టిన ప్రతి కార్యక్రమానికి నా వెన్నంటే ఉంటూ మద్దతుగా నిలిచిన నా కుటుంబానికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.













