‘బాహుబలి 2’ రికార్డుని బీట్‌ చేసిన ‘ఉరీ’

ప్రాంతీయ చిత్రంగా విడుదలై.. అంతర్జాతీయంగా వసూళ్ల వర్షం కురిపించిన సినిమా ‘బాహుబలి 2’. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన భారత చిత్రంగా రికార్డు సృష్టించింది. కాగా ఈ సినిమా డే-23, డే-24 వసూళ్లను (హిందీ భాషలో దేశవ్యాప్తంగా) ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ బీట్‌ చేసింది.

సినిమా విడుదలైన తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ బాక్సాఫీసు వద్ద వసూళ్లు తగ్గడం సాధారణమే. సినిమా బాగా ప్రేక్షకాదరణ పొందితే తప్ప కలెక్షన్సు చక్కగా కొనసాగవు. అలాంటిది తొలి రోజున దేశవ్యాప్తంగా రూ.8.25 కోట్లు రాబట్టిన ‘ఉరీ’ 23వ రోజున రూ.6.53 కోట్లు రాబట్టింది. 24వ రోజున రూ.8.71 కోట్లు రాబట్టడం విశేషం. ఇవి ‘బాహుబలి 2’ 23వ రోజు, 24వ రోజు వసూళ్ల కంటే అత్యధికం కావడం గమనార్హమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ‘బాహుబలి 2’ చిత్రం 23వ రోజున హిందీలో రూ.6.35 కోట్లు, 24వ రోజున రూ.7.80 కోట్లు రాబట్టిందని, ఇప్పుడు ఈ రికార్డును ‘ఉరీ’ బీట్‌ చేసిందని పేర్కొన్నారు.

రూ.45 కోట్లతో రూపొందించిన ‘ఉరీ’ సినిమా సోమవారానికి (ఫిబ్రవరి 4) దేశవ్యాప్తంగా మొత్తం రూ.192.84 కోట్లు రాబట్టిందని విశ్లేషకులు తెలిపారు. ‘బాహుబలి 2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1,810 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసింది. ‘ఉరీ’ ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ.281.73 కోట్లు రాబట్టినట్లు సమాచారం.

2016లో భారత సైన్యం పాకిస్థాన్‌పై చేపట్టిన మెరుపు దాడుల ఆధారంగా ‘ఉరీ’ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ కథానాయకుడి పాత్ర పోషించారు. పరేష్‌ రావల్‌, రజిత్‌ కపూర్‌, యామీ గౌతమ్‌, కృతి కుల్హారి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదలైంది.