దర్శకుడు శంకర్‌పై వడివేలు షాకింగ్‌ కామెంట్స్‌

కోలీవుడ్‌ హాస్య రంగంలో వడివేలుకు ప్రత్యేక స్థానముంది. ఈ తరం నటులు కూడా ఆయన్ను ఎంతగానో ఇష్టపడతున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న మీమ్స్‌ అందుకు దర్పణం పడుతున్నాయి. దాదాపు 18 ఏళ్ల క్రితం విడుదలైన ‘ఫ్రెండ్స్‌’ చిత్రంలో ‘కాంట్రాక్టర్‌ నేసమణి’ అనే పాత్ర పోషించారు వడివేలు. అందులో ఆయన తలపై సుత్తి పడటంతో బలమైన గాయమవుతుంది. ఆ సన్నివేశానికి కొనసాగింపుగా కొన్ని రోజులుగా లేని విషయం ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ అయింది. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ‘ప్రేపర్‌ నేసమణి’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో అది ట్రెడింగ్‌ కావడం విశేషం. తొలుత ఈ విషయం వడివేలుకు కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత ఈ అంశం అన్ని రాష్ట్రాలకు పాకింది. ఈ విషయానికి సంబంధించి పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు వడివేలు. అందులో భాగంగా దర్శకుడు శంకర్‌ నిర్మాణంలో శింబుదేవన్‌ దర్శకత్వంలోని ’24మ్‌ పులికేసి’ గురించి వడివేలు మాట్లాడుతూ అసలు శింబుదేవన్‌కు దర్శకత్వమే రాదు. ’23మ్‌ పులికేసి’ లో కూడా చాలా వరకు నేనే పనిచేశా. కొన్ని పాత్రలను నేనే రూపొందించా. హాస్య సన్నివేశాలను కూడా రాశా. ఇక ’24మ్‌ పులికేసి’లో కూడా వన్‌లైన్‌తో మాత్రమే శింబు దేవన్‌ వచ్చారు. దీంతో నేను పూర్తి స్థాయిలో చర్చించి.. అందులో త్రిపాత్రాభినయం వచ్చేలా కథ మార్చా. అంతేకాకుండా హాస్య సన్నివేశాలు కూడా చెప్పా. అప్పుడు సంపూర్ణ చిత్రంగా మారింది. దర్శకుడు శంకర్‌ అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రాఫిక్‌ సన్నివేశాలతోనే దర్శకుడిగా నెట్టుకొస్తున్నారు. అంతేకాకుండా.. ఆయనో గ్రాఫిక్స్‌ డైరెక్టర్‌ అంటూ విమర్శించారు వడివేలు.