HomeTelugu Big Storiesవైసీపీకి వంగవీటి రాధా రాజీనామా..!

వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా..!

13 8
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపినట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ సీటుపై హామీ రాకపోవడంతో ఆయన పార్టీ వీడినట్లు సమాచారం. రాధాకృష్ణ వైసీపీ వీడేందుకు సిద్ధమయ్యారన్న సమాచారంతో సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. అసంతృప్తితో ఉన్న రాధాకృష్ణతో చర్చలు జరిపి బుజ్జగించారు. అయినా, రాధాకృష్ణ శాంతించలేదు.

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాధాకృష్ణ సిద్ధమైన తరుణంలో సెంట్రల్‌ నియోజకవర్గ బాధ్యతలను వైసీపీ అధ్యక్షుడు జగన్‌ … మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అప్పగించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైనా రాధాకృష్ణ పార్టీ నిర్ణయంపై గతంలోనే నిరసన వ్యక్తం చేశారు. రాధాకృష్ణకు సన్నిహితంగా ఉండే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు, పలువురు వైసీపీ నేతలు బుజ్జగించడంతో రాధాకృష్ణ కొంతకాలం మౌనంగా ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో అంటీ అంటనట్లు వ్యవహరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మళ్లీ సెంట్రల్‌ టిక్కెట్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది. వైసీపీ అధిష్టానం రాధాకృష్ణను మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ రాధాకృష్ణ తనకు సెంట్రల్‌ టిక్కెట్‌ ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో చివరికి రాధాకృష్ణ వైసీపీని వీడారు.

“పేద ప్రజల స్ఫూర్తి, ఆకాంక్షలకు అనుగుణంగానే నా ప్రయాణం. ప్రజల ఆశయాలను కొనసాగించే దిశలో ప్రయాణం సాగించాలన్నదే నా ఆకాంక్ష. సీఎం కావాలన్న మీ కాంక్ష నెరవేరాలంటే వైకాపాలో అందరికీ ఆంక్షలు విధించడం తప్పనిసరి. నా ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం తప్పనిసరి” అని రాధాకృష్ణ.. జగన్‌కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణ రెండ్రోజుల తర్వాతే చెబుతానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. వైకాపాకు రాజీనామా చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు వీడుతానని ఎప్పుడూ చెప్పలేదని.. రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అందరితో చర్చించి రెండ్రోజుల తర్వాత మళ్లీ మీడియాముందుకు వస్తానని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయానికి గల కారణాలపై అందరితో చర్చించాల్సి ఉందన్నారు. టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుందన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు అన్ని విషయాలు రెండ్రోజుల తర్వాతే వెల్లడిస్తానని, అంతా సహకరించాలని రాధాకృష్ణ కోరారు.

14a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu