బాలీవుడ్ కు వెళ్తోన్న దక్షిణాది చిత్రం!

సౌత్ లో సూపర్ హిట్ అయిన కొన్ని చిత్రాలను అప్పుడప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తుంటారు. నటుడు అక్షయ్ కుమార్ ఇప్పటికే పలు సౌతిండియన్ చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. తాజాగా మరో సౌత్ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఆయన దృష్టి ఓ తమిళ చిత్రంపై పడింది. తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వీరం’ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాను తెలుగులో ‘కాటమరాయుడు’ పేరుతో పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ మాస్ మాసాల చిత్రం బాలీవుడ్ కు వెళ్తోంది. ఈ సినిమాకు ‘LOL-land of lungi’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఫర్హాద్ అనే దర్శకుడు ఈ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు. గతంలో దక్షిణాది చిత్రాలను బాలీవుడ్ లో నిర్మించిన సాజిద్ నడియావాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒరిజినల్ చిత్రంలో నటించిన తమన్నాను హిందీ రీమేక్ లో కూడా తీసుకోనున్నట్లు చెబుతున్నారు. మరి అక్షయ్ కుమార్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో… చూడాలి!