కొత్త లుక్ లో వెంకీ!

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ.. హీరోగా తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకున్న కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌. ఈ అగ్ర కథానాయకుడు నటించనున్న నూతన చిత్రం ‘ఆడాళ్ళూ..మీకు జోహార్లు’ త్వరలో ప్రారంభం కానుంది. కిషోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. వెంకటేష్ సరసన నిత్యామీనన్ నటించనున్న ఈ చిత్రాన్ని మల్టీడైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌ సమర్పణలో పి.ఆర్‌.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా..

కథానాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ.. ”డైరెక్టర్ తిరుమల కిషోర్ చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా నుండి అన్ని వర్గాల ప్రేక్షకులు ఆశించే అంశాలు ఇందులో వున్నాయి. ఈ చిత్రం కోసం ఓ స్పెషల్ లుక్ లో కనిపించబోతున్నాను. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని నమ్మకముంది” అని అన్నారు.
నిర్మాత రామ్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. ”వెంకటేష్ గారి కెరియర్ లో మరో వైవిధ్యమైన చిత్రంగా ‘ఆడాళ్ళూ..మీకు జోహార్లు’ ఉంటుంది. ఆయన పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వెంకటేష్ సరసన నిత్యామీనన్ విభిన్నమైన పాత్రలో కథానాయికగా కనిపించనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ముగింపు దశలో వుంది. అతి త్వరలోనే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురానున్నాము” అని అన్నారు.
దర్శకుడు కిషోర్‌ తిరుమల మాట్లాడుతూ.. ”అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇంతకు ముందు వెంకటేష్‌ నటించిన ‘ఆడవారిమాటలకు అర్థాలే వేరులే’, ‘మల్లీశ్వరి’, ‘నువ్వునాకునచ్చావ్‌’ తరహాలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. వెంకటేష్‌ గారి నుండి కుటుంబ ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రంలో వెంకటేష్‌గారి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. నిత్యామీనన్ పాత్ర అందరికి ఆసక్తిని కలిగించే విధంగా ఉంటుంది. ప్రస్తుతం సంగీత దర్శకుడు గోపిసుందర్ ఆధ్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి” అని తెలిపారు.