నా బరువు గురించి మాట్లాడితే ఊరుకోను..

భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌. 14 ఏళ్ల తన సినీ జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలు చేశారామె. ఇటు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు, అటు బరువైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అయితే హీరోయిన్‌ అంటే సన్నజాజిలా ఉండాలనే నియమం విద్యకు ఏమాత్రం వర్తించదు. శరీరాకృతితో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో విద్య తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారిలా..

“నా చిన్నతనం నుంచి నాకు హార్మోన్‌ సమస్యలున్నాయి. అందుకే బరువు పెరుగుతున్నాను. నేను చాలా అందంగా ఉన్నానని, కానీ నా బరువు కాస్త తగ్గించుకుంటే ఇంకా బాగుంటుందని నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు చాలా మంది అనేవారు. శరీర బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నేను వ్యాయామాలు చేయనని కొందరు నన్ను ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడితే ఊరుకోను. నేను వ్యాయామం చేయనని మీకు చెప్పానా? నా శరీరం బరువు తగ్గించుకోవడానికి ఎంత కష్టపడతానో మీకు తెలుసా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాను. గత కొన్నాళ్లుగా నా ఫొటోలను చూసుకోవడం మానేశాను. ఎందుకంటే వాటిని చూసినప్పుడల్లా ఇప్పుడు నేను ఇంకా బరువు పెరిగాననే బాధ నన్ను వేధిస్తుంది. అందుకే నా చిన్ననాటి ఫొటోలు చూసుకోవడం మానేశాను. ఇప్పుడు నేను బరువు తగ్గడం కంటే ముందు నా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి” అని తెలిపారు.

వృత్తి పరంగా ప్రముఖ గణితశాస్త్ర నిపుణురాలు శకుంతల జీవితాధారంగా రానున్న చిత్రంలో విద్య నటిస్తున్నారు. ఇందులో విద్య కూతురిగా సాన్యా మల్హోత్రా నటించనుంది. మరోవైపు బాలీవుడ్‌ హిట్‌ చిత్రం “పింక్‌” రీమేక్‌ “ఏకే 59” అనే తమిళ చిత్రంలోనూ విద్య నటించనుంది.