విజయ్ దేవరకొండకి మరో షాక్‌.. మొబైల్స్‌లో ‘టాక్సీవాలా’

తెలుగు సినీ ఇండస్ర్టీని పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం పైరసీ భారిన పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడింది. అదే సమయంలో విజయ్‌హీరోగా తెరకెక్కిన మరో సినిమా ‘టాక్సీవాలా’ కూడా పైరసీకి గురైనట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి లో కొంత మంది ఆకతాయిలు మొబైల్‌లో టాక్సీవాలా సినిమా చూస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు వారికి సినిమా ఎక్కడి నుంచి వచ్చింది. వారు ఎవరెవరికి ఫార్వర్డ్ చేశారన్న విషయాలను ఆరా తీస్తున్నారు. విజయ్‌ దేవరకొం‍డ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మాళవిక నాయర్‌, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చాలా కాలం క్రితమే రిలీజ్‌ కావాల్సి ఉన్నా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.