‘ఎన్టీఆర్‌’లో పురందేశ్వరి ఎవరంటే..!

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ లో నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ఇతర పాత్రలపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. బసవతారకంగా విద్యా బాలన్‌, నారా చంద్రబాబునాయుడిగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌.. తదితర పాత్రల గురించి అధికారికంగా వెల్లడించారు. అయితే ఇందులో ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరిగా ఎవరు కనిపించనున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది. విజయవాడకు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి హిమన్సీ ఈ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారట.

అంతేకాదు పురందేశ్వరి గెటప్‌లో హిమన్సీ ఉన్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పురందేశ్వరి ఆమె పక్కన నిల్చుని నవ్వుతూ కనిపించారు. హిమన్సీ ఈ పాత్రకు చక్కగా సరిపోయారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్బీకే ఫిల్మ్స్‌ పతాకంపై బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి.

Purandeswari in 'NTR' biopic movie