సింగీతంను కలిసిన బాలయ్య?

నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఆదిత్య 369, భైరవద్వీపం సినిమాలు బెస్ట్ సినిమాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. బాలయ్య వందో సినిమా సింగీతం తో చేస్తారని, ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ చేస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. బాలకృష్ణ ఆ రూమర్స్ ను పక్కన పెట్టి గౌతమీపుత్ర శాతకర్ణి చేశారు.

ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. ఆ తరువాత బాలకృష్ణ చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత బోయపాటితో సినిమా ఉంటుంది అనే ప్రచారం సాగుతున్న టైంలో బాలయ్య వెళ్లి సింగీతం శ్రీనివాసరావును కలవడం విశేషం. దాదాపు గంటపాటు ఆయనతో మాట్లాడారు.

దేని గురించి బాలకృష్ణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ను కలిశారు… అనే విషయాలు బయటకు రావడం లేదు. కెఎస్ రవికుమార్ సినిమా తరువాత సింగీతం తో సినిమా చేస్తారా లేదంటే మోక్షజ్ఞ లాంచింగ్ బాధ్యతలను అప్పగించేందుకు సింగీతంను కలిశారా అన్నది తెలియాలి. గతంలో బాలకృష్ణ చేసిన జానపద చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు అదే తరహా సినిమా కోసం బాలకృష్ణ ప్రయత్నం చేస్తున్నారు.