ప్రకాశ్‌రాజ్‌తో మహిళ అభిమాని సెల్ఫీ.. ఇంతలో ఆమె భర్త వచ్చి..!

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఓ మహిళా అభిమాని భర్త ఆయన ముందు దురుసుగా ప్రవర్తించారు. భార్య నటుడితో కలిసి ఫొటో దిగిందని దూషించారు. కశ్మీర్‌లో జరిగిన ఈ సంఘటనను ప్రకాశ్‌ సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది తనను ఎంతో బాధించిందని అన్నారు. ‘మనం ప్రేమించే వారిని ఎందుకు బాధపెడుతారు?, విభిన్న అభిప్రాయాలు ఉన్న వారిని ఎందుకు ద్వేషిస్తారు?’ అని ప్రశ్నించారు.

‘నేను గుల్మార్గ్‌లోని నా హోటల్‌కి నడుచుకుని వెళ్తున్నా. ఓ మహిళ తన అమ్మాయితో కలిసి నా వద్దకు వచ్చారు. సెల్ఫీ కావాలని అడిగారు. నేను ఇచ్చాను. వాళ్లు చాలా సంతోషించారు. కానీ ఒక్కసారిగా అక్కడికి మహిళ భర్త వచ్చారు. ఆమెను పక్కకు లాగి, దూషించారు. సెల్ఫీ డిలీట్‌ చేయమని అరిచారు. నేను మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన ఇలా ప్రవర్తించారు. చుట్టుపక్కల ఉన్న పర్యాటకులు మమ్మల్ని చూస్తున్నారు. ఆ మహిళ కన్నీరు పెట్టుకున్నారు. నేను ఆయన్ను పక్కకు తీసుకెళ్లి, మాట్లాడాస.

‘డియర్‌ సర్‌.. నీ భార్య నిన్ను పెళ్లి చేసుకుని, అందమైన కుమార్తెను నీకిచ్చి, జీవితాన్ని పంచుకోవడానికి.. నేను, మోడీ కారణం కాదు. వారు మీ అభిప్రాయాల్ని గౌరవిస్తున్నప్పుడు.. మీరూ అలానే వారినీ గౌరవించండి. విహారయాత్రను ఎంజాయ్‌ చేయండి’ అని చెప్పారు. ఆయన సమాధానం చెప్పకుండా నిల్చున్నారు. నేను బాధతో అక్కడి నుంచి వచ్చేశా.. ఆశ్చర్యంగా అనిపించింది.. ఆయన నా ఫొటోను డిలీట్‌ చేయనీ, చేయకపోనీ అది పెద్ద విషయం కాదు. కానీ వారి మనసుకు అయిన గాయాన్ని నయం చేయగలడా’ అని ప్రకాశ్‌రాజ్‌ ఓ పోస్ట్‌ చేశారు. ఆయన షూటింగ్‌ నిమిత్తం ఇటీవల కశ్మీర్‌ వెళ్లారు. ఆయన సతీమణి పోనీ వర్మ, కుమారుడు కూడా అక్కడికి వెళ్లి సమయం గడిపారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని ప్రకాశ్‌, పోనీ కొన్ని రోజుల క్రితం షేర్‌ చేశారు.