వైల్డ్‌ డాగ్‌ మూవీ రివ్యూ

కింగ్‌ నాగార్జున నటించిన తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. 35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్న కథా చిత్రాలను చేశాడు. జయాపజయాలను లెక్క చేయకుండా తన పంథాలో దూసుకెళ్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా పరాజయాలను ఎదుర్కొంటోన్న నాగ్‌.. ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌ ​సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. నూతన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాపై నాగ్‌తో పాటు ఆయన అభిమానులు కూడా ఎన్నో అశలు పెట్టుకున్నారు. ఇలా ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(ఏప్రిల్‌ 02) ఈ సినిమా విడులైంది.

కథ: విజయ్‌ వర్మ(నాగార్జున అక్కినేని) ఒక నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) అధికారి. సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులను పట్టుకోవడం అతని పని. అయితే అరెస్ట్‌ చేయడం కంటే అంతం చేయడమే ఉత్తమం ఆయన భావం. అందుకే డిపార్ట్‌మెంట్‌లో ఆయన్ని అంతా ‘వైల్డ్‌డాగ్‌’ అని పిలుస్తుంటారు. అలా అనేమంది తీవ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేసి సస్పెండ్‌ అవుతాడు. ఇదిలా ఉంటే పుణెలోని జాన్స్‌ బేకరిలో బాంబు బ్లాస్ట్‌ జరుగుతుంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంటుంది. కేసును త్వరగా చేధించాలని భావించిన డీఐజీ మోహన్‌ (అతుల్‌ కులకర్ణి).. సస్పెండ్‌ అయిన ఎన్‌ఐఏ అధికారి విజయ్‌ వర్మను తిరిగి విధుల్లోకి చేరాలని కోరతాడు. చివరకు విజయ్ వర్మ పెట్టిన కండీషన్‌కు ఎన్ఐఏ అధికారులు ఒప్పుకోవడంతో కేసును టెకప్‌ చేస్తాడు.

విజయ్‌వర్మ తన టీమ్‌ కలిసి బాంబు బ్లాస్ట్‌ కేసును దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో ఈ బ్లాస్ట్‌ను ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఖాలిత్‌ చేశాడని కనిపెడతారు. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్‌ మళ్లీ సస్పెండ్ చేస్తారు. అసలు విజయ్‌ని ఎన్‌ఐఏ అధికారులు ఎందకు సస్పెండ్‌ చేశారు? సస్పెండ్‌ అయినప్పటికీ తన టీమ్‌తో కలిసి ఖాలిత్‌ను ఎలా పట్టుకున్నాడు? విజయ్‌ లీడ్‌ చేస్తున్న ఎన్‌ఐఏ టీమ్‌లో ‘రా’ ఏజెంట్‌ అయిన ఆర్యా పండిట్‌ (సయామీ ఖేర్‌)ఎందుకు జాయిన్‌ కావాల్సి వచ్చింది? చివరకు ఖాలిత్‌ను విజయ్‌ వర్మ ఏం చేశాడు అనేదే మిగతా కథ.

నటీనటులు: ‘వైల్డ్‌డాగ్‌’ మూవీ కూడా ఓ ప్రయోగమనే చెప్పాలి. కింగ్‌ నాగార్జున తన పాత్రలో ఒదిగిపోయాడు. పోరాట ఘట్టాలను కూడా అవలీలగా చేశాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఫైట్‌ సీన్‌లో నాగ్‌ అదరగొట్టాడు. రా ఏజెంట్‌ ఆర్యాపండిత్‌ పాత్రలో సయామీ ఖేర్‌ జీవించేసింది. ఛేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లో నాగార్జునతో పోటీపడి మరీ నటించింది. విజయ్‌ వర్మ టీమ్‌ సభ్యుడిగా బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీరెజా ఒదిగిపోయాడు. నిడివి ఎక్కువగా ఉన్న పాత్ర తనది. విజయ్‌ వర్మ భార్య ప్రియగా దియా మిర్జా పర్వాలేదనిపించింది. నిడివి చాలా తక్కువైనప్పటికీ ఉన్నంతలో బాగా నటించింది. అతుల్‌ కులకర్ణి, ప్రకాశ్‌, ప్రదీప్‌ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ: హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమానే ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి కథను అందరికి నచ్చేలా చెప్పడం చాలా కష్టమైన పని. ఎటువంటి కమర్షియల్‌ హంగులు లేకుండా ఓ సిరియస్‌ స్టోరీని తెరపై చూపించి మెప్పించడంలో కొంతవరకు దర్శకుడు అహిషోర్‌ సాల్మన్ సఫలం అయ్యాడు అనే చెప్పాలి‌. ఉగ్రవాదిని పట్టుకునేందుకు హీరో తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్‌ చుట్టూ కథని తిప్పాడు. కథను పక్కదారి పట్టించకుండా కాన్సెప్ట్‌పై ఫోకస్‌ పెడుతూ సినిమా నడించాడు.

ఫస్టాప్‌ ఎక్కువగా ఎమోషనల్‌ కంటెంట్‌కు చోటు ఇచ్చిన దర్శకుడు. సెకండాఫ్‌ మాత్రం ఎక్కువగా ఫోరాట ఘట్టాలపైనే దృష్టిపెట్టాడు. సెకండాఫ్‌ అంతా చాలా సీరియస్‌, ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో విజయ్‌ వర్మ చేసే కొన్ని విన్యాసాలు మాత్రం రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక చివర్లో వచ్చే ట్విస్టులు మాత్రం అందరిని ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్‌ సంగీతం. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కీలక సన్నివేశాలకు ప్రాణం పోశాడు.

టైటిల్: వైల్డ్‌ డాగ్
న‌టీన‌టులు: నాగార్జున, దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా తదితురులు
ద‌ర్శ‌క‌త్వం: అహిషోర్‌ సాల్మన్‌
నిర్మాత : నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి
సంగీతం: తమన్‌

హైలైట్స్: నాగార్జున నటన
డ్రాబ్యాక్స్: ఫస్టాఫ్‌
చివరిగా: ఆసక్తికరంగా వైల్డ్‌ డాగ్‌
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

CLICK HERE!! For the aha Latest Updates