రివ్యూ: యుద్ధం శరణం

నటీనటులు: నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, రేవతి, శ్రీకాంత్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి
ఎడిటింగ్: కృపాకరన్
నిర్మాత: సాయి కొర్రపాటి, రజిని కొర్రపాటి
దర్శకత్వం: కృష్ణ మారిముత్తు
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘యుద్ధం శరణం’. కృష్ణ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
నాయక్(శ్రీకాంత్) ఓ రౌడీ. సిటీలో బాంబ్ పేలుళ్లతో విధ్వంసాలను సృష్టిస్తుంటాడు. ఈ బాంబ్ పేలుళ్లకు కారణమైన వారిని పట్టుకొని శిక్షించాలని భావిస్తుంది ప్రభుత్వం. దీనికోసం స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తుంది. మరోపక్క అర్జున్(నాగచైతన్య) తన కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. తన తల్లితండ్రులు ఇద్దరూ స్వచ్ఛంధ సేవా సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తుంటారు. వారి దగ్గర ట్రైనీగా జాయిన్ అయిన అంజలి(లావణ్య త్రిపాఠి)ను చూసి ప్రేమిస్తాడు అర్జున్. తన ప్రేమ విషయాన్ని తన తండ్రికి చెప్పి ఒప్పించాలనుకుంటాడు అర్జున్. ఈలోగా గుడికి అని బయలుదేరిన తన తల్లితండ్రులు ఇంటికి తిరిగిరారు. వారిని వెతకడం కోసం బయలుదేరిన అర్జున్ కి వారు శవాలుగా కనిపిస్తారు. అసలు అర్జున్ తల్లితండ్రులు ఎలా చనిపోయారు..? వారి చావుకి నాయక్ కు ఏమైనా సంబంధం ఉందా..? ఈ విషయం అర్జున్ కి తెలుస్తుందా..? అనే విషయాలు తెరపై చూడాల్సిందే!

విశ్లేషణ:
స్క్రీన్ ప్లే బేస్ చేసుకొని నడిచే సినిమా ఇది. ఒక సస్పెన్స్ ఎలిమెంట్ తో సినిమా మొత్తాన్ని దర్శకుడు తెరకెక్కించిన తీరు అభినందనీయం. సాధారణంగా సినిమాల్లో హీరోకి అతడి కుటుంబానికి అన్యాయం జరగడం దాన్ని హీరో ఎదిరించి విలన్ టీం ను అంతం చేయడం అన్ని సినిమాల్లో చూస్తుంటాం. ‘యుద్ధం శరణం’ కూడా అదే స్టోరీతో ఉంటుంది. అయితే ఇక్కడ హీరో తన తెలివిని ఉపయోగించి ఎలాంటి ఆయుధం చేపట్టకుండా శత్రువులను అంతం చేస్తాడు.

సినిమా మొదటిభాగం మొత్తం లవ్ స్టోరీ రెండు పాటలు, ఫ్యామిలీ సన్నివేశాలతో గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ప్రతీకార నేపధ్యంలో సాగుతుంది. తెలిసిన కథ కావడంతో ప్రేక్షకులు పెద్దగా త్రిల్ ఫీల్ అవ్వరు. అయితే స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. తరువాత ఏం జరుగుతుందో ఊహకు వచ్చేసినా.. దర్శకుడు తెరపై దాన్ని ఎలా చూపిస్తాడో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. నాగచైతన్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఒరిజినల్ గా చేసిన స్టంట్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. చైతు, లావణ్యల జంట తెరపై ముచ్చటగా ఉంది. లావణ్య త్రిపాఠి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో కాస్త గ్లామర్ తగ్గిందనే చెప్పాలి. 

కెమెరా పనితనం ఆకట్టుకుంది. నైట్ విజన్ కెమెరా ఉపయోగించి చిత్రీకరించిన సన్నివేశాలను ఇది వరకు తెలుగు సినిమాల్లో చూసి ఉండం. వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్, నిర్మాణ విలువలు బాగున్నాయి. అక్కడక్కడా బోర్ కొట్టించినా.. ఓవరాల్ గా సినిమా ఓకే అనిపించారు.