బాలకృష్ణ, వినాయక్‌ సినిమా టైటిల్‌ ‘ఏకే 47’!

నందమూరీ బాలకృష్ణ కథానాయకుడిగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ‘చెన్నకేశవరెడ్డి’ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా టైటిల్‌పై పలు వార్తలు ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి. ‘ఎన్‌బీకే 104’ అంటూ బాలకృష్ణ పుట్టినరోజున శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ‘ఏకే 47’ అనే పేరు పెడితే ఎలా ఉంటుందని చిత్ర బృందం ఆలోచిస్తోందట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యాక్షన్‌ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాదు, బాలకృష్ణకు జంటగా శ్రియ పేరును పరిశీలిస్తున్నారట. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని బాల‌కృష్ణ కోసం బ‌ల‌మైన మాస్ క‌థ‌ని వినాయక్‌ సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ తన తండ్రి నందమూరీ తారక రామరావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ ప్రస్తుతం ‘మణికర్ణిక’ చిత్రంతో బిజీగా ఉండటంతో వినాయక్‌ సినిమా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట బాలకృష్ణ. మరి ‘ఎన్టీఆర్‌’ కన్నా ముందే వీరి చిత్రం వస్తుందేమో చూడాలి.