మేము సైతంలో ఈ శ‌నివారం జ‌ర్న‌లిస్ట్ కోసం కొత్త అవ‌తారమెత్తిన మంచు విష్ణు

మేము సైతంలో ఈ శ‌నివారం జ‌ర్న‌లిస్ట్ కోసం కొత్త అవ‌తారమెత్తిన మంచు విష్ణు 
మంచులక్ష్మి ఒక ఎంట‌ర్ టైన్ ఛానెల్ లో చేస్తున్న మేము సైతం ప్రోగ్రామ్ గురించి తెలియ‌ని వారు లేరు అంటే అతిశ‌యోక్తి లేదు. సామాన్యుల ద‌గ్గ‌ర నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ ఈ కార్య‌క్ర‌మంపై పాజిటివ్ గా స్పందిస్తూ, త‌మ వంతు స‌హాయాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అటు ఎంట‌ర్ టైన్ మెంట్ తో పాటు, ఇటు సేవా కార్య‌క్ర‌మం కూడా జ‌రుగుతుండ‌టంతో ఈ షో ను ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌రిస్తున్నారు. అంతేకాదు, రాజ‌కీయ నాయకులు సైతం ఈ కార్య‌క్ర‌మానికి తమ వంతు సాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు.
 
ఇలాంటి కార్య‌క్ర‌మం తెలుగులో చేయ‌డం ఇదే మొద‌టి సారి, దీనికితోడు సేవా కార్య‌క్ర‌మం కావ‌డంతో మేము సైతం బాగా స‌క్సెస్ అయింది. ఇప్ప‌టికే ఆ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛానెల్ తో ల‌క్ష్మి మంచు చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం, అన్ని ఎపిసోడ్స్ ను పూర్తి చేసింది. సెప్టెంబ‌ర్ వ‌ర‌కు టెలికాస్ట్ కావ‌డానికి 27 ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసింది ల‌క్ష్మి మంచు. ఛానెల్ వారి కోరిక మేర‌కు ఇంకో 13 ఎపిసోడ్స్ ను కొన‌సాగించ‌డానికి కూడా ల‌క్ష్మి ఓకే అనేసింది. 
 
అయితే ఈ శ‌నివారం విష్ణు పానీ పూరీ అమ్మిన ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది. ఒక నిస్సహాయ జ‌ర్న‌లిస్ట్ కుటుంబానికి, పానీ పూరీ అమ్మి, అక్క తో పాటు క‌లిసి ఆ కుటుంబానికి చేయూత నిచ్చాడు మంచు విష్ణు.కేవ‌లం ఆ కుటుంబం కోసం బ‌య‌ట‌కు వెళ్లి, పానీ పూరీ అమ్మ‌డమే కాదు, వాళ్ల పిల్ల‌ల చ‌దువుల‌కు అయ్యే మొత్తం ఖ‌ర్చు, దాదాపు 25ల‌క్ష‌లను స్వ‌యంగా తానే భ‌రిస్తా అని చెప్పి, ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు విష్ణు. దీంతో జ‌ర్న‌లిస్టులు కూడా ఈ కార్య‌క్ర‌మంపై మ‌రింత మ‌క్కువ చూపుతున్నారు.
 
ఈ కార్య‌క్ర‌మం కోసం రానా మూట‌లు మోయ‌గా, అఖిల్ ఆటో డ్రైవ‌ర్ గా మారాడు. మోహ‌న్ బాబు ఇడ్లీ అమ్మ‌గా, ర‌వితేజ థియేట‌ర్ లో చిప్స్ అమ్మితే, ర‌కుల్ ప్రీత్ కూర‌గాయ‌లు అమ్మింది. ఇక మంచు ల‌క్ష్మి త‌మ్ముళ్లు విష్ణు పానీ పూరీ అమ్మితే, మ‌నోజ్ కూలీగా మారాడు. ఎంతైనా, ఓ స‌రికొత్త కార్య‌క్ర‌మం ద్వారా ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకుంటున్న మంచు ల‌క్ష్మికి హ్యాట్సాఫ్.
CLICK HERE!! For the aha Latest Updates